- కుంగిన గైడ్‌బండ్‌కు తాత్కాలిక మరమ్మతులు
- కారణాల గుర్తింపునకు నిజనిర్ధారణ కమిటీ చర్యలు
- పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో మంత్రి అంబటి
ప్రజాశక్తి - పోలవరం (ఏలూరు జిల్లా):గత ప్రభుత్వం ఎగువ కాపర్ డ్యాం నిర్మాణాన్ని అర్ధాంతరంగా వదిలివేయడం వల్ల భారీ నష్టం జరిగిందని, ఎగువ కాపర డ్యాంని మరో రెండు మీటర్లు ఎత్తు పెంచి భారీ వరదల నుంచి కాపాడామని రాష్ట్ర భారీ జలవనరుల శాక మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గైడ్ బండ్ కుంగడం సాంకేతికలోపమని, త్వరితగతిన మరమ్మతు పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును శుక్రవారం ఆయన సందర్శించారు. ప్రాజెక్టులో డయా ఫ్రమ్ వాల్ ప్రాంతంలో అగాధాలు పూడ్చివేత పనులు, వైబ్రో కాంప్లెక్షన్ పనులను, ఇటీవల గైడ్‌బండ్ కుంగిన ప్రాంతంలో గైడ్ బండ్, కూలిన రిటైనింగ్ వాల్‌లను పరిశీలించారు. రిటైనింగ్ వాల్ కూలడానికి, గైడ్ బండ్ కుంగడానికి సాంకేతిక కారణాలను, సంబంధిత వివరాలను మ్యాప్ పాయింటింగ్ ద్వారా మంత్రి అంబటికి ఎస్‌ఇ నరసింహమూర్తి, సిఇ సుధాకర్‌బాబు వివరించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గైడ్‌బండ్ కుంగడం పెద్ద ఆటంకమని, భారీ నష్టమని, ప్రమాదకరమని కొన్ని పేపర్లు, ఛానళ్లు గోరంతను కొండంతగా చేసి పెద్దఎత్తున ప్రచారాలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పవిత్రమైన ప్రాజెక్ట్ అని ఏది జరిగినా వేయి కళ్లతో పరిశీలించి ప్రత్యామ్నాయ చర్యలు చేస్తామన్నారు. రాజమండ్రిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీని గురువారం కలిసి సంబంధిత వివరాలు తెలుసుకున్నామన్నారు. కేంద్ర జలశక్తి శాఖ, జలవనరులశాఖ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే గైడ్ బండ్ నిర్మాణం జరిగిందని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీ చైౖర్మన్ పాండ్యా సూచనల మేరకు ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయనున్నామని పేర్కొన్నారు. వరదల సీజన్ అనంతరం పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపడతామని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో డయాఫ్రం వాల్ అతికీలకమని దీని పునరుద్ధరణ పనులు ఒక్క భావర్ కంపెనీ మాత్రమే చేయగలదని, ఆ కంపెనీతో డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసి ఎర్త్ కం రాక్‌ఫీల్ డ్యాం నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఎగువ, దిగువ కాపర్ డ్యాములు తాత్కాలికమైనవని, ఐదేళ్ల కాల పరిమితికి మాత్రమే నిర్మించారని, వాటి నుండి సీఫేజీ రావడం వల్ల ఎలాంటి నష్టం లేదని, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణం తర్వాత వాటిని తొలగిస్తామని చెప్పారు.










