- కాలువల నిర్వహణ కూడా చేయలేని ప్రభుత్వం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాగునీటి రంగానికి సిఎం జగన్ తీరని ద్రోహం చేశారని, రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ అటకెక్కించారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. సాగునీటి రంగం, ప్రాజెక్టుల నిర్మాణంపై సమాధానం చెప్పాలని, లేదంటే అధికారంలో కొనసాగే అర్హత లేదని అన్నారు. కోస్తాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై టిడిపి కార్యాలయం ఎన్టిఆర్ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల వారీ టిడిపి, వైసిపి ప్రభుత్వాలు చేసిన ఖర్చులు, వాటి స్థితిగతుల గురించి వివరించారు. కోస్తాంధ్ర ప్రాజెక్టుల కోసం టిడిపి ప్రభుత్వం రూ.21,442 కోట్లు ఖర్చు చేసిందని, వైసిపి నాలుగేళ్లలో కేవలం రూ.4,375 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు. తాము 23 ప్రాజెక్టులు పూర్తిచేసి 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించామన్నారు. వైసిపి నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేదని విమర్శించారు. వంశధార ఫేజ్-2 నిర్మాణంపై గడువు పెంచడం, తేదీలు మార్చి ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిపాటి మిగిలిన తోటపల్లి బ్యారేజీ నిర్మాణ పనులను ప్రభుత్వం పూర్తిచేయలేపోయిందని, రూ.56 కోట్ల ప్రజల సొమ్మును నీళ్లపాలు చేసిందని విమర్శించారు. బిల్లులు నిలిపేయడంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు కాంట్రాక్టరు పనులు ఆపేసి వెళ్లిపోయారని తెలిపారు. తారకరామ తీర్థ సాగర్ రిజర్వాయరులో పెరిగిన పిచ్చిచెట్లను తొలగించలేకపోయారని, హిరమండల పనులను ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పలేని దుస్థితి నెలకొందని అన్నారు. పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ట్రిబ్యునళ్ల ముందు నిలిపి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. తాటిపూడి ఆయకట్టు పనులను నిలిపేసి తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర లిఫ్ట్ బిల్లులు ఇవ్వకుండా పనులు ఆపారని, చింతలపూడి లిఫ్ట్‌కు నిధులు లేవని భూసేకరణ నిలిపేశారని వివరించారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా రాయలేక గేట్లు కొట్టుకుపోయేలా ప్రభుత్వం చేసిందన్నారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో ఒక టన్నెల్ తాము పూర్తిచేశామని, నీళ్లిచ్చే సమయానికి ఈ ప్రభుత్వం పనులన్నీ ఆపేసిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో తవ్విన మట్టిని శ్రీశైలం కొండల్లో పోస్తున్నారని, దీనివల్ల ప్రాజెక్టులో సిల్ట్ పెరిగి నష్టం ఎక్కువ జరుగుతుందని వివరించారు. గుండ్లకమ్మ రిజర్వాయరు నిర్వహణను పట్టించుకోకపోవడంతో గేట్లు కొట్టుకుపోయాయని, అడ్డగోలుగా ఇసుక తవ్వేయడంతో మొత్తం ప్రాజెక్టు ప్రమాదంలో పడే పరిస్థితి ఉందన్నారు. కృష్ణా డెల్టా ఆధునీకరణ ఆపేయడంతో ఇప్పటికీ లక్షల ఎకరాల్లో నీటి ఎద్దడి ఉందని, ప్రాజెక్టుల్లో గుర్రపుడెక్క తీయడం లేదని విమర్శించారు. ఇరిగేషన్ మంత్రి సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో రైతులే చందాలు వేసుకుని కాలువలు బాగుచేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గోదావరి డెల్టాలో గేట్లు సరిగ్గా లేవని, అన్నీ లీకవుతున్నాయని, కొన్ని గేట్లు తుప్పుపట్టాయని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా ఫ్లడ్ నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో పంటపొలాలు నీళ్లపాలవుతున్నాయని అన్నారు. రాయలసీమకు 300 టిఎంసిలు తరలించే గొప్ప ప్రాజెక్టు గోదావరి-పెన్నా నదుల అనుసంధానాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పినట్లు ఐదు నెలల్లో ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలో కట్టుకథలు చెప్పారని విమర్శించారు. విశాఖపట్నం కేంద్రంగా నాలుగేళ్లలో రూ.40 వేలకోట్లు దోచుకున్నారని, వీటితో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులూ పూర్తిచేసి మొత్తం భూములకు నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాజెక్టులకు నిర్దిష్ట గడువు విధించి పూర్తిచేస్తామని చెప్పారు.