Oct 31,2023 08:40

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ఎపి స్కిల్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ కేసులో ఇప్పటికే అరెస్టు అయి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో వున్న మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎపి సిఐడి మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదైందని ఎసిబి కోర్టుకు సోమవారం సిఐడి పిటిషన్‌ ద్వారా తెలిపింది. మద్యం కంపెనీలకు అక్రమ అనుమతుల కేసులో చంద్రబాబు ఎ3గా వున్నారని పేర్కొంది. ఈ కేసులో అప్పటి ఎక్సైజ్‌శాఖ కమిషనరు ఐఎస్‌ నరేష్‌ను ఎ1గా, మాజీ ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఎ2గా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎ3గా చేరుస్తూ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ మేరకు విజయవాడలోని ఎసిబి కోర్టులో పిటి వారెంటును సిఐడి వేయగా, కోర్టు విచారణకు అనుమతించింది. స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో రిమాండ్‌లో చంద్రబాబుపై ఇప్పటికే ఇన్నర్‌రింగ్‌ రోడ్డుకు సంబంధించి వారెంట్‌ పిటిషన్‌ పెండింగ్‌లో వుండగా, ఇప్పుడు మద్యం అమ్మకాలకు సంబంధించి అక్రమాలు జరిగాయనే కేసులో పిటి వారెంట్‌ను సిఐడి దాఖలు చేసింది.