అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేసుకు సంబంధించి రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. వెకేషన్ బెంచ్‌లో న్యాయమూర్తి ' నాట్ బిఫోర్ మి ' అనటంతో ఈరోజు రెగ్యులర్ బెంచ్‌లో విచారణకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ లిస్ట్ అయింది. హెల్త్ రిపోర్ట్‌లను అటాచ్ చేస్తూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎసిబి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తున్నారు. ఆయన తరఫున మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం దఅష్ట్యా బెయిల్ ఇవ్వాలని.. కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.