పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన
ప్రజాశక్తి - పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా):పోలవరం ప్రాజెక్ట్ పనులను గత ప్రభుత్వం ప్రొటోకాల్ భిన్నంగా చేపట్టిన కారణంగా డయాఫ్రమ్ వాల్‌కు నష్టం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టును తాము నిర్మిస్తామని చంద్రబాబు ప్రభుత్వం నెత్తినేసుకోవడమే గత ప్రభుత్వం చేసిన మొదటి తప్పిదమన్నారు. గోదావరి నీటిని మళ్లించేందుకు ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ పూర్తి చేసిన తరువాత డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉండగా, వాటిని పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించి రెండో తప్పిదం చేశారని విమర్శించారు. కాఫర్ డ్యామ్ మూడేళ్ల వరకు గ్యారంటీ ఉంటుందని, ఆ సమయంలోనే ఎర్త్ కం రాక్ ఫిల్ డాం నిర్మించుకోవలసి ఉంటుందని, నదిని డైవర్ట్ చేసే పని చేయకుండా లోయర్, అప్పర్ కాపర్ డ్యామ్ పనులు గత ప్రభుత్వం చేపట్టిందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రొటోకాల్‌కు భిన్నంగా నిర్మించడం వల్ల గతేడాది గోదావరి నదికి వచ్చిన వరద ఉధృతికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తమ ప్రభుత్వం సరిచేసిందని, ఎగువ కాఫర్ డాం ఎత్తును ఒకటిన్నర మీటర్లు పెంచామన్నారు. కాఫ్‌ర్ డ్యామ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్ తమ ప్రభుత్వం పూర్తి చేసిందని, స్పిల్‌వేకి గేట్లు తమ ప్రభుత్వమే ఏర్పాటుచేసి నది నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర జలసంఘం, నేషనల్ హైడ్రో ప్రాజెక్ట్ కార్పొరేషన్ నిపుణులు డయాఫ్రమ్ వాల్‌ని పరిశీలించిన తరువాత వారి సూచనల మేరకు డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులా లేక దానికి సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించడమా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. ప్రస్తుతం గోదావరి నదికి 1.2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, వరద నీటి కారణంగా ప్రాజెక్ట్ పనులకు ఎటువంటి అంతరాయం లేదని, వరద తీవ్రత ఇంకా పెరిగితే అప్పటి పరిస్థితి అనుసరించి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, చీఫ్ ఇంజినీర్ సుధాకర్ బాబు, సూపరింటెండెంట్ ఇంజినీర్ నరసింహమూర్తి పాల్గొన్నారు.










