
- కృష్ణా జలాపై కేంద్ర నిర్ణయం రాష్ట్రానికి నష్టం
- జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : 'కృష్ణానదీ జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పున: పంపణీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి నష్టం చేస్తుంది. దీనిపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం' అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. జలవనరులశాఖ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాలకు సంబంధించి కొత్తగా విధివిధానాలను రూపొందించడానికి ఒప్పుకోమని చెప్పారు. 'ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89లో ఇప్పటికే విధివిధానాలను నిర్వచించారు. కొత్తగా ఇవ్వడానికి వీల్లేదు. ఇది చట్ట విరుద్ధం. దీన్ని అంగీకరించలేం' అని అన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ హోంమంత్రి అమిత్‌షాను కలిసి వినతపత్రం స్వయంగా ఇచ్చారనిప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారని తెలిపారు. అయినా గెజిట్ విడుదల కావడంతో న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి) దాఖలు చేస్తామని పేర్కొన్నారు.క్యాబినెట్ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఎపికి రావాల్సిన ప్రతి నీటిబొట్టునూ తీసుకుంటామని వివరించారు. నూతన నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న వాటిని నీటి లభ్యత తగ్గుతుందన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రైతాంగానికి నీళ్లు ందించే విషయంలో రాజీపడబోమని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాలపై వివాదాలు సుదీర్ఘకాలంగా సాగుతున్నాయని తెలిపారు. 1976లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారమే రాష్ట్రాల నీటి వినియోగం జరుగుతోందని పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన 811 టిఎంసిల్లో ఎపికి 512, తెలంగాణకు 299 టిఎంసిలు కేటాయించారని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి వచ్చిన ప్రతి నీటిబొట్టునూ కాపాడుకుంటామని మంత్రి తెలిపారు. అన్యాయంగా తీసుకెళతామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోబోమని తెలిపారు. రాజకీయంగా అన్ని విషయాల్లోనూ కేంద్రానికి వైసిపి మద్దతు ఇస్తోందని, అయినా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది, దీనిపై ఎలా స్పందిస్తారని మంత్రిని ప్రశ్నించగా 'అది రాజకీయ నిర్ణయం, ఇది సాంకేతిక పరమైన అంశం' అని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి విలేకరులకు వాగ్వివాదం జరిగింది. 'ఆ రెండు పత్రికల ప్రతినిధులకు తాను సమాధానం ఇవ్వనని, ఇష్టం ఉంటే మాట్లాడతా లేకపోతే లేదని మంత్రి అన్నారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి : వి.శ్రీనివాసరావు డిమాండ్
కృష్ణా నదీ జలాల విషయంలో గత ట్రిబ్యునల్స్ ఇచ్చిన నిర్ణయాలను పున:సమీక్ష చేయాలన్న కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టాన్ని కలిగిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణా ఎన్నికలల్లో లబ్దికోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కృష్ణాజలాల వివాదాన్ని ముందుకు తెచ్చి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ జలాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఫైనల్ అని, దాన్ని మరలా సమీక్ష చేయడం అంటే తేనెతుట్టెను రేపడమేనని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల విషయంలో రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సూచించారు. ఈ విషయంలో కేంద్రానికి లొంగిపోతే రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతుందని పేర్కొన్నారు.
కేంద్రం నిర్ణయాలకు తలొగ్గితే రాష్ట్రానికి నష్టం : రైతుసంఘం
ఎన్నికల ప్రయోజనాల కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు తలొగ్గితే రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందనిఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈమేరకు శనివారం రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డిలు విడుదల చేసిన ప్రకటనలో సాగునీటి హక్కులకై రాష్ట్ర ముఖ్యమంత్రి గట్టిగా నిలబడాలని కోరారు. రైపేరియన రైట్స్ ప్రకారం నికర జలాల్లో దిగువ రాష్ట్రమైన మన రాష్ట్రానికి రావాల్సిన వాటాతో పాటు, రాయలసీమ ప్రాజెక్టులకు అవసరమైన నీటిని సాధించుకోవాల్సిఉందని పేర్కొన్నారు. అదే విధంగా తరుగు ఉన్న సంవత్సరాల్లో దామాషా పద్దతిలో నీటి విడుదలకు ఏర్పాటు చేసుకోవాల్సిఉందని సూచించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ అంశంపై రాష్ట్రంలోని అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి. అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.