Aug 03,2022 22:02

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి, అనకాపల్లి :అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండెక్స్‌ సెజ్‌లోని సీడ్స్‌ దుస్తుల కంపెనీని తాత్కాలికంగా మూసివేసినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. వాయువు శాంపిల్స్‌ను ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసిటి)కి పంపించామని, నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అస్వస్థతకు గురైన మహిళ కార్మికులు అనకాపల్లి ఎన్‌టిఆర్‌ ఆస్పత్రిలో 42 మంది, ఉష ప్రైమ్‌లో 40 మంది, సత్యదేవ్‌లో 11 మంది, స్టాజన్‌లో ముగ్గురు, మెడరైజ్‌లో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. వాంతులు, కళ్లుతిరగడం, ఆయాసం వంటి లక్షణాలతో వీరంతా ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం సుమారు 50 మంది ఇంటికి వెళ్లిపోయారు. జూన్‌ 3న సీడ్స్‌ కంపెనీలో విషవాయువు లీకైన ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకుండా తాత్సారం చేసిన ఫలితంగానే మరోసారి సీడ్స్‌ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జాతీయ రహదారిపై రాస్తారోకో
 సిపిఎం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో

జాతీయ రహదారిపై రాస్తారోకో
ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బ్రాండిక్స్‌ ఇండియన్‌ పార్టనర్‌ దొరైస్వామిని అరెస్టు చేయాలని కోరుతూ బైపాస్‌ రోడ్డు జాతీయ రహదారిపై సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, బాలకృష్ణ, సిఐటియు కోశాధికారి వివి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు నిర్వహించి యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని లోకనాథం డిమాండ్‌చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. సిపిఎం నాయకులను అరెస్టును ఆ పార్టీ అనకాపల్లి మండల కన్వీనర్‌ గంట శ్రీరామ్‌ తీవ్రంగా ఖండించారు.
పలువురి పరామర్శ
చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సుభద్ర, తెలుగుదేశం నాయకులు పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, సిపిఐ నాయకులు సత్యనారాయణ మూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, గనిశెట్టి సత్యనారాయణ, జనసేన నాయకులు తదితరులు పరామర్శించారు.
ఉన్నతస్థాయి కమిటీకి సిఎం ఆదేశం
గ్యాస్‌ లీక్‌ ఘటనలో బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై సిఎం జగన్‌ ఆరా తీశారు. గ్యాస్‌ లీక్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఘటనపై ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. కారణాలను వెలికితీయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టిపెట్టాలని, రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో కూడా సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలని ఆదేశించారు.