Jan 15,2021 08:10

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు, కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీం కోర్టు ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కమిటీ నలుగురు సభ్యుల్లో ముఖ్యలైన భారతీయ కిసాన్‌ సంఘం (బికెయు) అధ్యక్షుడు భూపీందర్‌ సింగ్‌ మాన్‌ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. కమిటీ సభ్యుడిగా తనను నామినేట్‌ చేసినందుకు కృతజ్ఞతలని, అయితే రైతు ప్రయోజనాల విషయంలో తాను రాజీపడే ప్రసక్తే లేదని, రైతు శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో అనిల్‌ ఘన్వాట్‌, అశోక్‌ గులాటి, భూపీందర్‌ సింగ్‌ మాన్‌, ప్రమోద్‌ కుమార్‌ జోషీలు సభ్యులుగా ఉన్నారు. కాగా, కమిటీలోని నలుగురు సభ్యులూ నూతన చట్టాలకు అనుకూలంగా ఉన్నవారేనంటూ రైతు సంఘాలు ఆక్షేపించటంతో భూపీందర్‌ సింగ్‌ మాన్‌ కమిటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.