Feb 08,2021 13:57

ఇన్ని గొంతులు ప్రశ్నిస్తున్నాయంటే
హక్కుల్ని నులిమే
కాళరాత్రులు రాబోతున్నాయని అర్థం.
మట్టిని నమ్మే మనిషికి పన్ను
ఆ మనిషిని కూల్చే దళారికి దన్ను
పంటను ఎగరేసుకుపోయే చట్టాలు
ఉపిరిలూదుతున్నాయి.
ఆసరాగా నిలవాల్సిన
మద్దతు ధరలు అడుగు వేయక
ఇంకా మంటలు రేపుతూనే ఉన్నాయి.
రైతు చితికిపోతున్నాడు
తన పొలంలోనే కూలీ అవుతున్నాడు.
పొలంపై స్వతంత్రం కోల్పోతున్నాడు
ఏమి పండించాలో
ఎవరికి అమ్మాలో
అన్నీ ముందే నిర్ణయించబడతాయి.
కష్టాన్ని ఎత్తుకోవటం తప్పా
ఏదీ నీది గాదు
గొంతు తడారి పోవటం తప్పా
నీ పంటకు స్వేచ్ఛలేదు
పీల్చే గాలికి స్వేచ్ఛలేదు
రహదారుల వెంట
పోరాటాల నడుమ
బతుకు ఉడికిపోతోంది.
దేశ రైతాంగమంతా
కష్టానికి భరోసా
మనిషికి ఆసరా
జీవితానికి తగిన స్వేచ్ఛ
దోపిడీ లేని రాజ్యం కోసం
పోరాటబాట పడుతున్నాయి.
మరో సూర్యోదయం కోసం
నిరసన జెండాలూపుతూ..

గవిడి శ్రీనివాస్‌
7019278368