చంఢీగడ్ : వరద సాయం కోసం శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన రైతులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కెఎంఎస్‌సి) నేతృత్వంలోని 16 యూనియన్‌లకు చెందిన రైతు నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సోమవారం తెల్లవారుజామున వీరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. కెఎంఎస్‌సి రాష్ట్ర అధ్యక్షుడు శర్వణ్ సింగ్ పంథేర్, బికెయు (క్రాంతికారి ) ప్రెస్ సెక్రటరీ బల్దీప్ సింగ్, కెఎంఎస్‌సి రాష్ట్ర ప్రెస్ సెక్రటరీ కన్వర్‌దిలీప్ సింగ్, బికెయు (బెహర్‌మేక్)కి చెందిన చంకౌర్ సింగ్, బర్త్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. మరికొందరు నేతల కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
వరద కారణంగా నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారం వెంటనే చెల్లించాలంటూ రైతు సంఘాలు ఆగస్ట్ 22న చంఢగీడ్‌లో నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనకు సంబంధించి చంఢీగడ్ మరియు పంజాబ్ పోలీసులకు, రైతు సంఘాలకు మధ్య ఆదివారం సుదీర్ఘ చర్చలు జరిపినట్లు రైతు నేత శర్వణ్‌సింగ్ పంథేర్ తెలిపారు. అయితే చర్చలు విఫలమయ్యాయని అన్నారు. అనంతరం ఆదివారం రాత్రి పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కూడా కలిశామని చెప్పారు. నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఈ అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌కెఎం సహా పలు రైతు సంఘాలు ఈ అరెస్ట్‌లను ఖండించాయి.