Aug 03,2023 21:40

ప్రజాశక్తి-సోమందేపల్లి (శ్రీసత్యసాయి జిల్లా) :అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... రూకులపల్లి గ్రామానికి చెందిన కురుబ శ్రీనివాసులు (30)కు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో బోర్లు, వర్షాధార పంటలుగా వేరుశనగ, మొక్కజన్న, కూరగాయల పంటలను సాగు చేసేవారు.ఇందు నిమిత్తం సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశారు. గత ఐదేళ్లుగా పండిన పంటలు చేతికందకపోవడంతో చేసిన అప్పులకు కనీసం వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. వ్యవసాయంలో నష్టాలు రావడం, అప్పులు తీర్చలేనన్న బాధతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.