Dec 10,2020 06:43

భారత్‌బంద్‌ అత్యంత జయప్రదంగా జరిగింది. ఢిల్లీ ముట్టడి రైతాంగ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. 13 రోజులు కుటుంబాలకు కుటుంబాలు తరలివచ్చి ఢిల్లీ శివారు రోడ్లను బంధించారు. కందకాలు, బారికేడ్లు ప్రజల ఆగ్రహం ముందు ఆటంకాలుగా నిలువలేకపోయాయి. రహదారులే ఉద్యమానికి శిబిరాలయ్యాయి. రైతులు తమ నిత్యావసరాలు, పౌర సదుపాయాలు సమకూర్చుకొని రోడ్లపై బైఠాయించిన తీరు ప్రభుత్వానికి హెచ్చరికైంది. రైతుల మనుగడక,ి దేశం సాధించుకున్న ఆహార స్వయం పోషకత్వానికి ప్రమాదంగా పరిణమించిన మూడు చట్టాలు రద్దు కావాలన్న నినాదం వందల సంఖ్యలో రైతు సంఘాల్ని ఏకం చేసింది. రాజకీయ అనుబంధాలు ఏమైనా రైతాంగ ప్రయోజనాలు ముఖ్యమన్న నినాదం మారు మోగింది. చర్చలు జరిపినా చట్టాల రద్దును ప్రభుత్వం నిరాకరించడంతో బంద్‌ అనివార్యమైంది. జమ్మూ కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు రైతులు స్పందించారు. ఆర్థికమాంద్యం, వ్యవసాయ ఉత్పత్తులకు ధరల నిరాకరణ, కరోనా వైపరీత్యం, ప్రజల ఆదాయాలు అడుగంటిన నేపథ్యం భూమిక కాగా కాకుల్ని కొట్టి గద్దలకేసినట్లు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రైతాంగ ప్రయోజనాల్ని బలి చేయడానికి పూనుకుంది. ఈ దుర్మార్గపు దాడిని ప్రతిఘటించడానికి రైతాంగం సమాయత్తమైంది. 62 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం ఈ దేశంలో ఉందని అంచనా. దానిపై కార్పొరేట్ల డేగ కన్ను పడింది. మోడీ ప్రభుత్వం చేసిన పార్లమెంటు చట్టాలతో కార్పొరేట్లు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు. ఒకే దేశం ఒకే మార్కెట్‌ విధానంతో మద్దతు ధర మాయమై రైతులపాలిటి శాపంగా, కార్పొరేట్లకు వరంగా మారనుంది. కోట్లాది రైతులున్న దేశంలో పట్టుమని పది మంది కూడా ఉండని కార్పొరేట్లు కూడబలుక్కొని రైతుల్ని కొల్లగొట్టరాదన్నదే ఈ ఉద్యమానికి ప్రేరణ అయ్యింది. కార్మికవర్గం పెద్ద ఎత్తున ఈ బంద్‌ జయప్రదం చేసేందుకు తోడయింది. మోడీ వ్యవసాయ సంస్కరణలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకు వచ్చిన రైతాంగానికి ఈ సందర్భంగా జేజేలు.

డిసెంబరు 8 బంద్‌- ప్రత్యేకత
13, 14 రోజులు రైతాంగ బైఠాయింపు, డిసెంబర్‌ 8 బంద్‌- ఇదే ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ అయింది. యువత, చదువుకొన్నవారు రైతులకు మద్దతుగా చాలా సానుకూలంగా స్పందించారన్న వార్తలు వచ్చాయి. డిసెంబర్‌ 7 సాయంకాలానికి మేధావులు, వివిధ సామాజిక తరగతులు బంద్‌కు బాసటగా నిలిచారన్న ప్రచారం ఊపందుకున్నది. ఏ పార్టీలైతే సెప్టెంబర్‌లో పార్లమెంటులో 3 చట్టాలకు అనుకూలంగా ఓటేశారో ఆ పార్టీలు సైతం బంద్‌ సందర్భంగా సానుకూలంగా స్పందించక తప్పలేదు. పార్లమెంటులో వామపక్షాలు చాలా కాలంగా కార్పొరేట్‌ల ఆర్థిక విధానాలను ప్రతిఘటిస్తూ వచ్చాయి. కాని ఆనాడు వాటితో గొంతు కలిపిన పార్టీలు చాలా తక్కువ. కాని రైతన్నలు ఒక్కుమ్మడిగా కదిలాక నేడు స్వేచ్ఛా మార్కెట్‌ పేరుతో తెచ్చిన వ్యవసాయ బిల్లుల్ని వామపక్షాలేగాక ఇతర ప్రాంతీయ పార్టీలు, శక్తులు, సంస్థలు వ్యతిరేకించడమో, ప్రతిఘటించడమో జరిగింది. ఇదే ఈనాటి బంద్‌లో ప్రత్యేకత. నవంబర్‌ 11న సెంటర్‌ ఆఫ్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అన్న సంస్థ దేశంలో తాజా ఆర్థిక పరిస్థితుల్ని విశ్లేషించింది. స్టాక్‌ మార్కెట్‌లో ఉన్న 1897 లిస్టెడ్‌ కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లను అధ్యయనం చేసింది. 2019తో పోల్చితే 2020 లో ఈ లిస్టెడ్‌ కంపెనీల ఆదాయాలు పెద్ద ఎత్తున పెరిగాయి. 2019లో లక్ష కోట్లు వీటి ఆదాయాలుగా ఉంటే 2020 సెప్టెంబర్‌లో వీటి ఆదాయాలు లక్షా 44 కోట్లకు పెరిగింది. ప్రజలందరి ఆదాయాలు పడిపోతున్న రోజుల్లో కార్పొరేట్‌ కంపెనీల ఆదాయాలు పెరిగాయి. కరోనా వైపరీత్యం ఉపాధిని కబళించి ప్రజల ఆదాయాల్ని దెబ్బతీసింది. ప్రజల ఆదాయాల క్షీణత 2020 మొదటి త్రైమాసికంలో 24 శాతం, రెండవ త్రైమాసికంలో 10 శాతం వరుసగా వృద్ధి రేటు పడిపోయింది. ఈ కాలంలోనే కార్పొరేట్ల ఆదాయాలు పెరిగాయి. ఉద్యోగుల సంఖ్య తగ్గించడం, పని భారం పెంచడం, వేతనాల కోత వీటికి తోడు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకాలు కార్పొరేట్ల కొమ్ముగాశాయి. దీంతో లక్ష కోట్ల నుండి లక్షా 44 కోట్లకు కార్పొరేట్లకు లాభాలు పెరిగాయి. ఈ బంద్‌ ఇంత పెద్ద ఎత్తున జయప్రదం కావడానికి ఆర్థిక వ్యవస్థలో ఈ పరిణామాలు కూడా తోడయ్యాయి.కార్మిక చట్టాలకు తెచ్చిన సవరణలు కూడా కార్మిక వర్గాన్ని స్పందింపజేశాయి. ఇది కూడా వర్తమాన పరిణామాల్ని వేగిరపర్చింది.
 

ప్రాంతీయ పార్టీలు
రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు వైఎస్‌ఆర్‌సిపి, తెలుగుదేశం రైతు వ్యతిరేక బిల్లులకు పార్లమెంటులో అనుకూలంగా ఓటేశాయి. సెప్టెంబర్‌ నుండి ఈ బిల్లులు రైతుల పాలిట ఉరితాళ్ళని ఆందోళన సాగుతున్నా రాష్ట్రంలో ఈ పార్టీలు తమ విధానాల్ని పున:పరిశీలన చేయలేదు. భారీ స్థాయిలో ఢిల్లీ దిగ్బంధనం, ఆందోళన ఆఖరికి ఎన్‌డిఎ కూటమిలో చీలికలకు కారణమయ్యాయి. అకాలీ పార్టీ విడగొట్టుకోవడమేగాదు, హర్యానాలో జననాయక్‌ జనతా పార్టీ, రాజస్థాన్‌లో రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్‌ పార్టీ ఎన్‌డిఎ లో భాగస్వాములుగా ఉండి రైతు వ్యతిరేక బిల్లుల విషయంలో బిజెపి మీద ఒత్తిడి పెంచాయి. బిల్లులు రద్దు కావాలన్న ఉద్యమంలో రైతులకనుకూలంగా స్పందించాలని డిమాండ్‌ చేశాయి. డిసెంబర్‌ 8 పిలుపుతో 25 రాజకీయ పార్టీలు, 10 కేంద్ర కార్మిక సంఘాలు, 51 ట్రాన్స్‌పోర్టు యూనియన్లు, 32 విద్యా సంస్థలు, 5 వ్యవసాయ కార్మిక సంఘాలు బాహాటంగా బంద్‌కు మద్దతు పలికాయి. రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి. ఈ బంద్‌ వివిధ ప్రాంతీయ పార్టీల మీద తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ పార్టీ డిసెంబర్‌ 8 బంద్‌ సందర్భంగా మధ్యాహ్నం వరకు ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, విద్యా సంస్థలు బంద్‌ చేయమని చెప్పింది. తెలుగుదేశం కలెక్టర్లకు దరఖాస్తుల పేరుతో మద్దతు ధర కావాలనే నినాదాన్ని పుచ్చుకున్నది. బిజెపి ఈ బంద్‌కు వ్యతిరేకంగా నోరెత్తి మాట్లాడలేకపోయింది. వరదల్లో సహాయం, పాడైపోయిన రోడ్ల మరమ్మతులు వగైరా మాట్లాడిందే తప్ప బంద్‌ను వ్యతిరేకించలేకపోయింది. జనసేన బిజెపితో జతకట్టి ఉనికి కోసం పాకులాడుతోంది. ప్రాంతీయ పార్టీలు ఈ రైతాంగ ఆందోళన ముందు ఎంతో కొంత తలొగ్గక తప్పలేదు. పాల్గొన్నది తక్కువే అయినా కొన్నిచోట్ల తెలుగుదేశం వారు స్వయంగా పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌సిపి షరతులతో కూడిన మద్దతని రైతులకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో ఇదొక ప్రత్యేకత.
 

రైతాంగం స్పందన
డిసెంబర్‌ 8 బంద్‌కు రాజకీయ పక్షాల అనుబంధాలతో నిమిత్తం లేకుండా వివిధ తరగతుల ప్రజానీకం మద్దతునిచ్చింది. అపూర్వమైన స్పందన రైతు వ్యతిరేక చట్టాల మీద వెల్లడైంది. రైతు సంఘాలు వివిధ శక్తుల్ని, సంస్థల్ని కూడగట్టడంలో మంచి పాత్ర నిర్వహించాయి. నికరంగా నిలబడి పోరాడుతున్న రైతాంగానికి వామపక్షాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు బాసటగా నిలవడం ఈ బంద్‌లో మరో కీలకాంశం. రైతాంగంలో వ్యక్తమైన సంకల్పం బంద్‌ జయప్రదానికి కీలకంగా నిలిచింది.
                                                       * పెనుమల్లి మధు (వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి)