Aug 08,2023 13:10

తిరుపతి డిస్కమ్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు
 మాజీ ఎంపి మధు సహా 26 మంది అరెస్టు, విడుదల
10 నుంచి నిరవధిక సమ్మెలోకి :పోరాట కమిటి


ప్రజా శక్తి - తిరుపతి సిటీ/విజయవాడ
తిరుపతి లక్ష్మీపురం సర్కిల్‌లో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతకు దారితీసింది. సిఎం హామీ మేరకు విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, 45 శాతం ఫిట్‌మెంట్‌, మూడు వెయిటేజీలతో కూడిన పిఆర్‌సిని శాశ్వత ఉద్యోగులకు ఇవ్వాలని, పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని, కారుణ్య నియామకాల్లో అడ్డగోలు నిబంధనలను రద్దు చేయాలని, 2022 ఆధారంగా పిఆర్‌సి వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ కార్మికులు సోమవారం మహాధర్నా చేపట్టారు. పోలీసుల ఆంక్షలను లక్ష్యపెట్టకుండా డిస్కమ్‌ పరిధిలోని జిల్లాల నుంచి వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు.

madhu


కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. కార్మికులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన సిపిఎం మాజీ ఎంపి పెనుమల్లి మధు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి సహా 26 మందిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను పరి ష్కరించని పక్షంలో ఆగస్టు 10 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు హెచ్చరించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ కార్మికులు లక్ష్మీపురం సర్కిల్‌ వద్దకు ఎర్రజెండాలతో భారీగా చేరుకుని ధర్నా నిర్వహించారు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నానుద్దేశించి విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల పోరాట కమిటీ చైర్మన్‌ సుదర్శన్‌ రెడ్డి ప్రసంగిస్తూ.. ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకు దిగొచ్చిన అధికారులతో నేతలతో చర్చించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
సమస్యలు పరిష్కరించండి సామూహిక నిరసన దీక్ష
విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్ల పోరాట కమిటీ, విజయవాడ సర్కిల్‌ రీజనల్‌ కమిటీ ఆధ్వర్యాన విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రీజనల్‌ అధ్యక్షులు ఎల్‌రాజు, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు నాగరాజు, సర్వేశ్వరరావు, శ్రీనివాస్‌, కిరణ్‌, జగన్‌, మణిపాల్‌ దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం విడనాడి వారి న్యాయమైన డిమాండ్‌లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్‌.బాబూరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకులు కళాధర్‌, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నాయకులు జిలానీ బాషా తదితరులు పాల్గొన్నారు.