Oct 30,2023 15:06

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : గిరిజన చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఆ ప్రభుత్వానికి రాష్ట్రంలోనే వైసిపి టిడిపి వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా రక్షణ బేరి పేరిట సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర పార్వతిపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ కేంద్రంలో సోమవారం ప్రారంభం అయింది. యాత్రను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. సుబ్బారావు జండా ఊపి ప్రారంభించారు. యాత్రకు  కురుపాంలో సిపిఎం శ్రేణులు, గిరిజనులు, వివిధ వర్గాల ప్రజల ఘనంగా స్వాగతం పలికారు. పెట్రోల్ బంక్ జంక్షన్ లో గిరిజన సాంప్రదాయ నృత్యాలు, డప్పు, వాయిద్యాలుతో స్వాగతం పలికారు. అక్కడ నుండి రావడ రోడ్డు జంక్షన్ వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గిరిజనులు పోరాడి సాధించుకున్న చట్టాలను సవరించి దోపిడీ చేస్తుందన్నారు. అందులో భాగంగానే అటవీ హక్కుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని అన్నారు. చట్ట ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి గరిష్టంగా 10 ఎకరాలు వరకు భూమి ఇవ్వవలసి ఉన్నప్పటికీ తు మంత్రంగా పంపిణీ చేసిందన్నారు. అభివృద్ధి పేరుతో కొండ కోనలను ధ్వంసం చేసి అందులో నిక్షిప్తమైన గనులను కార్పొరేట్ సంస్థలకు ధారాధాత్తం చేస్తుందని విమర్శించారు.

bvr

ఇందుకోసం పీసా చట్టాన్ని విఘాతం కలిగిస్తుందన్నారు. మరోవైపు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తగినంతగా కేంద్ర ప్రభుత్వం కేటాయించట్లేదని అన్నారు. ఆరా కొరాగ త్వరగా కేటాయించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 1000 గిరిజన గ్రామాలు 5వ షెడ్యూల్  పరిధిలో లేకపోవడం వల్ల వారికి ఐటిడిఎ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన బతుకులు నాశనం చేసే ప్రతి చట్టానికి వైసిపి, టిడిపి పార్టీలకు చెందిన ఎంపిలు చేతులెత్తి మరి మద్దతు తెలియజేస్తున్నారని విమర్శించారు. వీటికి తోడు జనసేన కూడా బిజెపితో జతకట్టిందని విమర్శించారు. ఈ మూడు పార్టీలు తోడుదొంగల గిరిజనుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తున్నాయని అన్నారు. ఇటు రాష్ట్రంలో ఋషికొండను తవ్వేసి 40 కోట్లతో భవనాలు నిర్మిస్తున్న సీఎం జగన్ కు రాష్ట్రంలోని అభివృద్ధి సమస్యలు పట్టడం లేదన్నారు. ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు కోసం కూడా వీరు ప్రయత్నం చేయడం లేదని అన్నారు. మోడీ చేసేది పరిపాలన కాదని, మత కుల ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారని అన్నారు. ఇటీవల మణిపూర్లో చోటు చేసుకున్న పరిణామాలు తార్కాణంగా చెప్పుకోవచ్చు అన్నారు. మతము, కులం ముసుగులో మణిపూర్లో హత్యలు హత్యాచారాలకు బిజెపి యే ఉసిగొల్పిందని అన్నారు. ఇటువంటి మతోన్మాదులకు అవకాశం ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజా హక్కులు కాపాడే వారికే అవకాశం ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం పోరాడే శక్తులు వామపక్షాలు సిపిఎంకు అవకాశాలు ఇవ్వాలని అన్నారు. 

 సాధికార యాత్ర చేపట్టే హక్కు వైసిపి కి లేదు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు 

రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర చేపట్టే హక్కు వైసిపి ప్రభుత్వానికి నైతిక హక్కు లేదన్నారు. అడవులు, భూమి ఘనులు వంటి సహజ సంపదను దోచిపెట్టె కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో వైసిపి జతకట్టిందని విమర్శించారు. ఉపాధి నిధులు కేంద్ర ప్రభుత్వం తగ్గించగా అరకోరగా వచ్చిన విధులను సీఎం జగన్ మళ్లిస్తున్నారని అన్నారు. 
జగన్మోహన్ రెడ్డి పేదలకు, దళితులకు, గిరిజనులకు ఇచ్చిన భూమి కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో తాగునీరు, వైద్యం, విద్య సదుపాయాలు తగినంతగా లేవన్నారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా పేదలు గిరిజనులు రైతులు కోసం ఏర్పాటుచేసిన చట్టాలను కేంద్రం నీరుగారిస్తుంటే చూస్తున్న వైసిపి సామాజిక జపం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రభుత్వం కూడాా మోడి మోసకారి విధానాలకు వంత పాడుతుందని విమర్శించారు . అదాని ప్రయోజనాల కోసం రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు జగన్మోహన్రెడ్డి పెంచారని అన్నారు. చట్టసభల్లో నీతి నిజాయితీ గల నాయకులు లేకపోవడంతో వైసిపి టిడిపి నాయకులు బూతుల డిక్షనరీ తయారు చేస్తున్నారని విమర్శించారు. ఎర్రజెండా నాయకత్వంలో వామపక్షాలు చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చ జరిగేదని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. సుబ్బారావమ్మ మాట్లాడుతూ మోడీ జగన్ జోడి ప్రభుత్వాల్లో సరైన రహదారులు, వైద్య సదుపాయాలు లేకుండా పోయావని అన్నారు. మహిళలకు భద్రత కూడా కొరవడిందన్నారు. కార్మికులకు కూడా ఉద్యోగ భద్రత , కనీస వేతనాలు వంటి వాటికి నోచుకోలేదు అన్నారు.
సిపిఎం రాష్ట్రకమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలకు దున్నుకోవడానికి భూమి, కూలి పనులు చేసినా పనికి తగినంత కూలి లేకుండా చేశాయని అన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి ఏడాదికి 200 రోజులు పని రోజువారి వేతనం రూ. 600 కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. అవినాష్ అధ్యక్షతన జరిగిన సభలో కార్యదర్శి వర్గ సభ్యులు వి. ఇందర, చెముడుగూడ ఎంపీటీసీ ఎం. రమణ, మండల కార్యదర్శి కె. శ్రీనివాసరావు  మాట్లాడారు.