Jul 23,2023 20:37
  •  కోటేశ్వరరావు సంస్మరణ సభలో పలువురు వక్తలు

ప్రజాశక్తి-విజయవాడ : దేశ భవిష్యత్తు కోసం బిజెపిని గద్దె దించాల్సిందేనని పలువురు వక్తలు అన్నారు. సిపిఎం విజయవాడ నగర కమిటీ సభ్యులుగా, సిఐటియు నేతగా, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేసిన రాజమహేంద్రవరపు కోటేశ్వరరావు సంస్మరణ సభ సిపిఎం విజయవాడ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్‌ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముందుగా కోటేశ్వరరావు చిత్రపటానికి మాజీ ఎంపి పి.మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు వి.ఉమామహేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ... మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలను అవలంభిస్తోన్న బిజెపికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించడమే కోటేశ్వరరావుకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వెరవకుండా, ప్రజాఉద్యమాల్లో ఎంతో చురుకుగా పని చేశారని కొనియాడారు. మణిపూర్‌లో రెండు తెగల మధ్య మారణహోమాన్ని సృష్టించి, వందలాది మంది గిరిజనుల మృతికి కేంద్ర ప్రభుత్వం కారణమైందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. మార్క్సిజాన్ని నమ్మి చివరి వరకు అనేక ప్రజా ఉద్యమాల్లో రాజీలేని పోరాటం చేసిన ఆర్‌కె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు గంగాధర్‌, ఆర్‌కె మేనల్లుడు సాంబశివరావు మాట్లాడారు.