Jul 03,2023 20:36
  • మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం చిత్తూరు డెయిరీ స్థానంలో అమూల్‌ డెయిరీని స్థాపించేందుకు భూమి పూజ చేయడానికి వస్తున్నారని, ఈ నిర్ణయానికి వెంటనే స్వస్తి పలకాలని సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు డిమాండ్‌ చేశారు. తిరుపతి యశోదా నగర్‌లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాడి రైతులను అమూల్‌ డెయిరీ కబ్జా చేయడమే కాకుండా వారి ప్రయోజనాలను దెబ్బతీసేలా విధానాలు ఉన్నాయని విమర్శించారు. అమూల్‌ డెయిరీని ప్రమోట్‌ చేస్తే వచ్చే ఆదాయం అహ్మదాబాద్‌కు పోతుంది మినహా మన రాష్ట్రానికి ఒరిగేదేమీలేదన్నారు. సహకార రంగంలో నడుస్తున్న విశాఖ డెయిరీ, విజయవాడలోని విజయ డెయిరీ రైతులకు మేలు చేసేందుకు లీటర్‌ పై రూ.12 అదనంగా ఇస్తున్నాయని గుర్తు చేశారు. అలాంటి సహకార డెయిరీలను అమూల్‌కు కట్టపెట్టేందుకు ముఖ్యమంత్రి కుట్రలు పన్నారని విమర్శించారు. విజయవాడ విజయ డెయిరీకి రైతులు పాలు పోయనీయకుండా, అమూల్‌కి పోయాలని క్యాంపులు వేసి మరీ జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ ఆర్‌జెడిలు ప్రచారం చేస్తున్నారని ఇది సరికాదని అన్నారు. బిజెపి పాలనలో రాజ్యాంగ వ్యవస్థకే ముప్పు వాటిల్లిందని తెలిపారు. కామన్‌ సివిల్‌ కోడ్‌ ఉమ్మడి పౌరస్మృతి పేరుతో దేశంలో విభజన తెచ్చేందుకు పథకం ప్రకారం బిజెపి పావులు కదుపుతోందని విమర్శించారు. లా కమీషన్‌ తిరస్కరించినప్పటికీ తిరిగి పట్టు పట్టి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి బిజెపి ప్రయత్నించండం దారుణమన్నారు. మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి పాల్గొన్నారు.