- విభజన హామీలపై సమీక్షలో సిఎం
- నేడు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన సమావేశం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెవరేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. విభజన హామీల పురోగతిపై మంగళవారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, పదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ అనేక అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయనీ తెలిపారు. అప్పుల్లో ఎపికి 58 శాతం, తెలంగాణాకు 42 శాతం కేటాయించారని రెవెన్యూ పరంగా చూస్తే 58 శాతం తెలంగాణాకు, 42 శాతం ఎపికి వచ్చిందని పేర్కొన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఆదాయాలు ఎలా పెరుగుతాయని అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే హామీలు ఇచ్చారని, పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్థల పరంగా అన్ని రకాల సదుపాయాలూ కోల్పోయాని తెలిపారు. దీన్ని సర్దుబాటు చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు హామీ ఇచ్చారని, అయితే అమలు కాలేదని అన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ప్రకటించామని, వాటిల్లో రవాణా సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని తెలిపారు. దీనికి కేంద్రం నుండి సమగ్ర సహకారం, సహాయం అవసరం ఉందని, దీనిపై కేంద్రాన్ని గట్టిగా కోరాలని తెలిపారు. సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు ఖచ్చితంగా వచ్చేలా చూడాలని కోరారు. స్టీలు ప్లాంటుకు సమీప ప్రాంతంలో ఎన్‌ఎండిసి గనుల కేటాయింపు చేసేలా చూడాలని, దీనివల్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సులభమవుతుందని తెలిపారు. విశాఖపట్నం నుండి కర్నూలు మీదుగా రాయలసీమకు హైస్పీడు రైలు కారిడార్‌ను కోరాలని సూచించారు. దీనివల్ల మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. వైజాగ్, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచుతామన్నారని, దానికి అవసరమైన సదుపాయాలు కల్పించలేదని పేర్కొన్నారు. విశాఖలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానయానానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ ముఖ్యమని, దీనికి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సాయం అందించాల్సి ఉందని తెలిపారు. ఎయిర్‌పోర్టుల భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి వస్తోందని తెలిపారు. విశాఖ మెట్రో రైలు అంశాన్ని కొలిక్కి తీసుకురావాలని, ప్రైవేటు డెవలపర్ 60 శాతం భరిస్తున్నందున భూసేకరణ మినహా 40 శాతం కేంద్రం భరించేలా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.