Nov 17,2023 09:58
  • గృహ నిర్మాణశాఖపై సమీక్షలో సిఎం
  • పావలా వడ్డీపై రుణాలకు బకాయిలు చెల్లింపు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : టిడ్కో ఇళ్ల నిర్వహణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, అసోసియేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గృహ నిర్మాణశాఖపై గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలనే అంశంపై వారికి తగిన విధంగా సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. దీనివల్ల భవనాలు మరింత నాణ్యంగా ఉండేలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాలు కల్పనపై నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడ ఏ సమస్యను గుర్తించినా వెంటనే దాన్ని సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి ఇంటినీ ఆడిట్‌ చేసి సదుపాయాలు ఉన్నాయా లేవా అన్న అంశాలను పరిశీలించాలని ఆదేశించారు. కరెంటు, తాగునీరు, సోక్‌పిట్లపై ఎప్పటికప్పుడు ఆడిట్‌ చేయించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణం కోసం 12,72,143 మందికి పావలా వడ్డీకి రూ.35 వేల చొప్పున రూ.4,483 కోట్ల రుణాన్ని ఇప్పించామని, పావలా వడ్డీపై మిగిలిన రుణం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సిఎం తెలిపారు. వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

మ్యాజిక్‌ సోక్‌పిట్లు

గత అక్టోబరులో 7.43 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని, ఫిబ్రవరి నాటికి మరో ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వీటికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. సదుపాయాలనూ పరిశీలించామని, కరెంటు, తాగునీరు సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. మ్యాజిక్‌ సోక్‌పిట్లు ఏర్పాటు చేస్తున్నామని సిఎంకు వివరించారు.