రైతు ఉద్యమ సంఘీభావ సదస్సు తీర్మానం
దేశ వ్యవసాయ రంగాన్ని, రైతు ఉనికిని దెబ్బ తీసే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, గిట్టుబాటు ధరల గ్యారెంటీ కోసం చట్టం చేయాలని రెండు నెలలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమానికి రైతు ఉద్యమ సంఘీభావ సదస్సు సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఉద్యమం సందర్భంగా అశువులుబాసిన 126 మంది రైతులకు సదస్సు సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో నల్ల చట్టాల రద్దుకై విజయవాడ ఎం.బి విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన ''రైతు ఉద్యమ సంఘీభావ సదస్సు'' తీర్మానం చేసింది. సదస్సులో తీర్మానాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రవేశ పెట్టారు. సదస్సు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. సదస్సుకు హాజరు కాలేకపోయిన ఆర్‌ఎస్‌పి, బిఎస్‌పి లు తమ మద్దతును తెలిపాయి.
తీర్మానం వివరాలు...
బిజెపి తప్పుడు ప్రచారానికి చెంపపెట్టుగా దేశవ్యాపితంగా వివిధ తరగతుల ప్రజానీకం నుండి వివిధ రూపాలలో ఈ ఉద్యమానికి సంఘీభావం విస్తారంగా వ్యక్తమవుతోంది. రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక సంఘాలు, సంస్థలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. మహిళా, యువజన, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. దళిత, ఆదివాసి, వృత్తి తరగతులు ఉద్యమాన్ని బలపరుస్తున్నాయి. మేధావులు, ఆర్థికవేత్తలు ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని పెద్ద సంఖ్యలో ప్రభుత్వాన్ని కోరాయి. మాజీ సైనికులు స్పందించి ఉద్యమానికి అండగా నిలబడ్డారు. బిజెపి మిత్ర పక్షాలు సైతం వ్యతిరేకించాయి. ప్రపంచం నలు మూలల నుండి సంఘీభావం వ్యక్తమవుతోంది. ఇంతటి స్థాయిలో ఉద్యమానికి మద్దతు లభిస్తున్నా, ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకుండా మోడీ మొండిగా వ్యవహరించడాన్ని ఈ సదస్సు ఖండించింది. ఇప్పటికైనా ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకొని రైతులకు మేలు చేసే 'గిట్టుబాటు ధరల చట్టం' చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని సదస్సు డిమాండ్ చేసింది. లేని పక్షంలో ప్రతిఘటనోద్యమం ఇంకా తీవ్రతరమవుతుందని హెచ్చరించింది.
రైతులను ఢిల్లీలో అడుగు పెట్టనీయకుండా నిరోధించడానికి నీటి ఫిరంగులు, బాష్పవాయువు, లాఠీచార్జీలతో సహా తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించింది. అయినా రైతులు మొక్కవోని పట్టుదలతో ముందుకే సాగడంతో ఢిల్లీ పొలిమేరల్లో వారిని అనుమతించక తప్పలేదు. లక్షలాది మంది అక్కడే శాంతియుతంగా అసాధారణ రీతిలో ఎముకలు కొరికే చలి, భారీ వర్షాలను లెక్క చేయకుండా ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఆధునిక ప్రపంచ చరిత్ర లోనే ఇదొక అపూర్వ ఘట్టం. ఈ చట్టాల వల్ల రైతులు హక్కుగా పొందుతున్న కనీస మద్దతు ధరల విధానం (యం.ఎస్.పి) రద్దవుతుంది. పంటల ధరలు తగ్గితే ప్రభుత్వం మార్కెట్టులో కొనుగోలు చేయదు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టు వ్యవసాయం చేపట్టి రైతుల పైన, వారి భూముల పైన ఆధిపత్యం వహిస్తాయి. రైతుల నుండి కారుచౌకగా వ్యవసాయోత్పత్తులను కొని వినియోగదారులపై భారం మోపి అధిక లాభాలు కొల్లగొడతారు. అప్పుల పాలై దివాళా ఎత్తి రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరుగుతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ బలహీన పడుతుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ప్రజలకు తినడానికి తిండి కూడా కరువవుతుంది. కార్మికులు, ఉద్యోగులపై ధరల భారం పడుతుంది. ఇది ఆకలిచావులకు కూడా దారితీస్తుంది. ఈ చట్టాల పర్యవసానంగా రైతులు భూములు కోల్పోతారు. కౌలురైతులకు చేసుకోవడానికి భూములు దొరకవు. విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి. యాంత్రీకరణతో గ్రామీణ నిరుద్యోగం వలసలు పెరుగుతున్నాయి. పట్టణాల్లో ఉపాధి ఒత్తిడి పెరిగి శ్రామికులు దారుణ దోపిడీకి గురవుతారు. వేతనాలు పడిపోతాయి. కార్మిక హక్కులు హరించబడతాయి. వ్యవసాయ చట్టాల మాదిరే, లేబర్ కోడ్ పేరుతో కార్మికుల హక్కులు రద్దు చేయబడ్డాయి. రిటైల్ వ్యాపారం దెబ్బ తినడం ఇప్పటికే ప్రారంభం అయ్యింది. చిన్న వ్యాపార సంస్థలు, పరిశ్రమలు మూత పడుతున్నాయి. విద్యా, వైద్యంలో కార్పొరేట్ ఆధిపత్యంతో ఫీజులు పెరుగుతాయి. వ్యవసాయ చట్టాలు కొనసాగడమంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొద్దిమంది కొల్లగొట్టడమే. వ్యవసాయం, విద్య, విద్యుత్‌లపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలది. కానీ ఈ కొత్త చట్టాలతో కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని హరించింది.
కేంద్ర బిజెపి రాజ్యసభలో ప్రజాస్వామ్యం గొంతు నులిమి ఈ చట్టాలను ఆమోదింపచేసుకుంది. పార్లమెంటు సభ్యులకు చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా దొడ్డిదారిన ఈ చట్టాలకు ఆర్డినెన్సులను తెచ్చింది. రైతులు, రైతు సంఘాలతో చర్చించలేదు. తీవ్రంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచాలన్న ఎత్తు పారకపోవడంతో చర్చలు మొదలెట్టింది. ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి కోర్టుల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నది. చట్టాలను బలపరిచేవారితో కమిటీ వేయడమంటే అసలు సమస్యను నీరుగార్చడమే. ఈ చారిత్రాత్మక ఉద్యమానికి రాష్ట్రంలో యావత్ ప్రజానీకం - కులం, మతం, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా - అండగా నిలవాలని ఈ సదస్సు విజ్ఞప్తి చేసింది. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి (సంయుక్త కిసాన్ మోర్చా) ఇచ్చే పిలుపులన్నింటినీ జయప్రదం చేయాల్సిందిగా కోరింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ - ప్రత్యేకించి వైఎస్సార్‌సిపి, తెలుగుదేశం - ప్రత్యక్షంగా ఈ ఉద్యమానికి మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేసింది. రైతు సంఘాలు పిలుపునిచ్చినట్లుగా 23వ తేదీ రాజ్‌భవన్ వద్ద ధర్నా, 26 రైతు కవాతులను అన్ని జిల్లా కేంద్రాల్లో జయప్రదం చేయాలని ఈ సదస్సు కోరింది.










