Nov 19,2020 06:42

భారత దేశపు సంపదలన్నింటిని విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ వర్గాలు 'ఏకాత్మత'తో దోపిడీ చేయడానికి వీలుగా...అడ్డూ అదుపూ లేని నిరంకుశ కేంద్రీకృత విధానాలను బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోంది. దాని దూకుడును అడ్డుకోలేకపోతే పూర్తిగా కేంద్రానికి సాగిలపడి బతకాల్సిన దుర్దినాలు రానున్నాయి. అయినప్పటికీ రాష్ట్రం లోని నిన్నటి, ఇవాళ్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ, తమలో తాము కలహించుకోవడమే కార్యక్రమంగా పెట్టుకుని రాష్ట్ర ప్రజలకు ఎనలేని అపకారం చేస్తున్నాయి. రెండు పార్టీల నాయకత్వాలూ తమ ప్రత్యర్థులను విలన్లుగా, తాము మాత్రం హీరోలుగా ప్రజల కోసమే తమ విధానాలు, చర్యలూ ఉన్నాయన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నాయి. అక్టోబరు ఆరవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ. బాబ్డేకు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణపై, తీవ్రమైన ఫిర్యాదుతో కూడిన ఉత్తరం రాయడం ఇందులో భాగమే. ఈ రెండు పార్టీల మధ్య శత్రుత్వాన్ని సాధ్యమైనంత ఎగదోసి, ఇరుపక్షాలు బలహీనపడిపోతే తాము లాభం పొందవచ్చన్నది కేంద్ర బిజెపి పాలకులు అనుసరిస్తున్న ఎత్తుగడ.
 

జగన్‌ మోహన్‌ రెడ్డి లేఖలో ఏముంది?

తాను ముఖ్యమంత్రి అయిన పిదప, గడచిన సంవత్సరన్నర కాలంలో తన ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తప్పుబడుతూ కొట్టివేస్తోందని...దీని వెనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పాత్ర ఉన్నదనేది జగన్‌ లేఖలో పేర్కొన్న అతి ముఖ్యమైన అంశం. ఉన్నత న్యాయ స్థానాలలో కేసులను విచారించే జడ్జీలను ఒక్కొక్క కేసుకు ఒకరిని లేక కొందరిని నియమించే పద్ధతిని 'రోస్టర్‌' అంటారు. అలాంటి రోస్టర్‌ను జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తన పలుకుబడిని ఉపయోగించి, తన ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పులను ఇచ్చే విధంగా న్యాయమూర్తులను నిర్ణయించి, వారిని ప్రభావితం గావిస్తున్నారని జగన్‌ ఆరోపణ! లోపాయకారిగా ఇలాంటివి కోర్టులలో జరుగుతూ వుంటాయన్నది పెద్ద రహస్యమేమీ కాదు.

జగన్‌ మోహన్‌ రెడ్డి పై మొత్తం 31 కేసులు వున్నాయి. వాటిలో సిబిఐ వి 11 దాకా వుంటే, ఇ.డి పెట్టినవి 7 కేసులు. నిజానికి భారతదేశం లోని ప్రజా ప్రతినిధులపై మొత్తం 4,859 క్రిమినల్‌ కేసులు పెండింగులో ఉన్నాయి. అందులో 174 మంది ప్రస్తుతం చట్టసభలలో ప్రతినిధులుగా ఉన్నారు. బెంగాల్‌లో ప్రజా ప్రతినిధులపై దాఖలైన 131 కేసుల్లో 103 కేసులు ప్రస్తుత శాసనసభ లోని వారి పైనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 1374, బీహార్‌లో 557- ప్రస్తుత, గత ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 37 ఏళ్ల క్రితం నమోదయిన క్రిమినల్‌ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో వున్నట్లు తాజాగా బయట పడిందిట! పాపం! ఏమీ ఎరగనట్లు మరొకసారి ఆశ్చర్యాన్ని ప్రకటించిన సుప్రీంకోర్టు, వీటి సంగతి అర్జెంటుగా తేల్చేయాలని కింది కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలుగా విడతలు విడతలుగా సుప్రీంకోర్టు ఈ తరహా ఆదేశాలను జారీ చేస్తూనే ఉంది. అయితే ఈసారి జారీ చేసిన సుప్రీంకోర్టు బెంచ్‌లో జస్టిస్‌ ఎన్‌.వి. రమణ కూడా ఉన్నారు. ఆయన హైకోర్టు లాయర్‌గా ఉంటూ తెలుగుదేశం పార్టీకి న్యాయ సలహాదారుగా కొంతకాలం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో అడ్వకేట్‌ జనరల్‌గా మరి కొంత కాలం పనిచేశారు.

మొత్తంగా పెండింగ్‌ క్రిమినల్‌ కేసులన్నీ పరిష్కారం చేయడం అంత సులభం కాదని పై స్థాయి రాజకీయ నాయకులందరికీ తెలుసు. అయితే అందులో కొన్నిటి పైనయినా, మచ్చుకు కొన్ని కంటి తుడుపు చర్యలు చేపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వేటు ఎవరి మీద పడుతుంది? ముందే జవాబు చెప్పలేని ప్రశ్న ఇది. రాజకీయ వైరుధ్యాలు తేల్చుకోవడంలో భాగంగా కొందరిపై శిక్షలు పడవచ్చు. ఎవరో ఒకరు ఆ వేటుని చవిచూడవచ్చు. జయలలిత అక్రమ ఆస్తుల కేసు విషయంలో జరిగిన విచారణ, శిక్షా క్రమం దీనికి ఉదాహరణ. మరొక వైపున న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, పవిత్రతను కాపాడటం అనే పేరిట, జగన్‌ లాంటి వాళ్ళు అలా ఉత్తరాలు రాయడం ఏమిటి? రాస్తే రాశారు, దానిని పత్రికా ముఖంగా బట్టబయలు చేయడం ఏమిటి? అంటూ నయగారాలు పోయే మీడియా కూడా మనకు ఉంది.

న్యాయ వ్యవస్థ యావత్తూ ప్రస్తుత నయా ఉదారవాద, అవినీతిమయ వ్యవస్థకు అతీతంగా వుందన్న భ్రమను ఈ రాతలు కలిగిస్తున్నాయి. అసమానతలు నిండిన నేటి మన సమాజపు యథాతథ స్థితిని పరిరక్షించటానికి, పాలక సమూహాల ఉమ్మడి అవసరాలను తీర్చడమే పరమ కర్తవ్యంగా పెట్టుకొని మన న్యాయ వ్యవస్థ నడిచిందని, కార్మికుల సమ్మెల పట్ల తీసుకున్న వైఖరి నుంచి, షహీన్‌బాగ్‌ నిరసన వరకూ, గాట్‌ ఒప్పందం నుండి, అటవీ హక్కుల పేర ఆదివాసులను గెంటి వేసే తీర్పు వరకూ, కివేన్మణి నుంచి చుండూరు నరమేధంలో దోషులను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పు వరకూ చరిత్ర తేటతెల్లం చేస్తున్నది. ఇటీవల తెలంగాణ ఆర్‌టిసి కార్మికుల సమ్మె విషయంలో కోర్టు వ్యవహరించిన తీరు దీనికి తాజా ఉదాహరణ. న్యాయమూర్తులు కూడా పాలక సమూహాలతో ఆ వర్గాలతో, అనివార్యంగా ముడి వేసుకొని సాగటంతో, వారి కోసం వారు ఏర్పరుచుకొన్న విభజన రేఖలను వారే చెరుపుకోవడం నేటి పరిణామం. అందుకే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు కూడా న్యాయమూర్తులను రాజకీయ వివాదాల లోకి ఈడ్వ గలుగుతున్నారు. ఇది పెరుగుతున్న ఆర్థిక, సామాజిక సంక్షోభాలకు ఒక సూచిక.

మొత్తంగా పరిశీలించినపుడు ఈ వ్యవహారంలో భారత ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థ మన దేశంలోని కొందరు మేధావులు భావిస్తున్నట్లు స్వతంత్రంగా ఏమీ లేదని, అధికార రాజకీయ వర్గాల వైరుధ్యాల నడుమ అది కూడా చిక్కుకొని ఉందని మనకి స్పష్టంగా అర్ధమవుతుంది. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటూ అప్పుడప్పుడు న్యాయవ్యవస్థ చేసే ప్రకటనలు మేకపోతు గాంభీర్యం తప్ప మరేవీ కావు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో కలసి అంతిమంగా, పాలక వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా, నడువ వలసినదే న్యాయ వ్యవస్థ కూడా! ఈ న్యాయ వ్యవస్థలో కొన్ని గొప్ప ప్రజానుకూల తీర్పులు రావడానికీ, ప్రజానుకూల న్యాయమూర్తులు న్యాయ పీఠాలను అధిష్టించడానికి గల కారణం ఏమంటే, గొప్ప సామాజిక, ప్రజా ఉద్యమాలు వాటి నేపథ్యంలో ఉండటం !

ఇప్పుడు ఉన్నత న్యాయ స్థానాల లోని న్యాయమూర్తులందరూ కలిసి, తమను తామే నియమించుకునే కొలీజియం లాంటి 'స్వయం భూ' వ్యవస్థ గాని, రాజకీయ దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన నియామకాల వ్యవస్థ (నేషనల్‌ జ్యుడీషియల్‌ అప్పాయింట్‌మెంట్‌ కమిషన్‌) గాని, ఎన్ని రకాల రాజ్యాంగబద్ధ నీతులు వల్లించినా, ఏదో ఒక అధికార పక్షానికి మొగ్గు చూపకుండా సాగలేదని అనేక తీర్పుల అనుభవాలు చెబుతున్నాయి. నిన్నగాక మొన్న బాబ్రీ మసీదు వివాదంపై తీర్పు అలాంటిదే! ముద్దాయిలందరూ మసీదు కూల్చివేత సమయంలో అక్కడే ఉన్నా, ఒక్కరికి కూడా మసీదు కూల్చివేతతో సంబంధం లేదట! ఎవరో దుండగులు మసీదును కూల్చి వేసినట్లు భావించిన సుప్రీంకోర్టు, దాన్ని కూల్చిన చోటనే పునర్నిర్మించి ఇవ్వమని ప్రభుత్వాన్ని ఆదేశించటానికి బదులు కూల్చిన వారి (ఉన్మాద) మత విశ్వాసాలను గౌరవిస్తున్నానని తీర్పు చెప్పింది. ఆ మాట చెప్పటానికి 28 సంవత్సరాలు కావాల్సి వచ్చింది. అంతెందుకు, కరోనా వ్యాధి సోకిన పిదప 'ఆపన్న ప్రధానమంత్రి' అనే పేరిట ఒక ప్రత్యేక నిధిని గత మార్చి నెలాఖరున ఏర్పాటు చేశారు. దానికి సమకూడే నిధుల జమా ఖర్చులను తనిఖీ చేసేందుకు సిఏజి (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) వారు కూడా పనికి రారని ప్రభుత్వమే నిర్ణయించుకోవడం న్యాయ విరుద్ధమంటూ సుప్రీం కోర్టుకు వెళితే, సుప్రీంకోర్టు 'ఆపన్న నిధులను' 'కాగ్‌' తనిఖీ చేయనవసరం లేదని తీర్పు ఇచ్చింది.

ఒకరి అంతాన్ని మరొకరు చూసుకునేందుకే కాట్లాడుకుంటున్నట్లు కనిపించే టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి పార్టీలు రెండూ, తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వాగ్దానం చేసి కూడా, నిస్సిగ్గుగా ఠలాయిస్తున్న కేంద్ర బిజెపి పాలకులను బలపరచటంలో పోటీ పడుతున్నాయి. రాష్ట్రాలను సామంత రాజ్యాలుగా దిగజార్చే కేంద్రీకృత ఏక రాజ్య (యూనిటరీ) విధానాలను ఖండించటానికి కూడా ఆ ఇద్దరికి నోరు రావటం లేదు. సామ్రాజ్యవాద బహుళజాతి కార్పొరేట్ల విచ్చలవిడి దోపిడీకి ఇరువురూ జో-హుకుములు పలుకుతున్నారు. దేశ రక్షణ రంగంతో సహా సమస్త ప్రభుత్వ రంగాలనూ ప్రైవేటీకరిస్తూ, బడా సంపన్నులను బలిపించే, అసమానతలను ఇంకా ఇంకా పెంచుతున్న మోడీ విధానాలకు ఊతాన్ని ఇవ్వటానికే ఇద్దరూ సిద్ధపడుతున్నారు. నిన్నగాక మొన్న వ్యవసాయ బిల్లు పేరుతో విదేశీ కార్పొరేట్‌ దోపిడీకి సమస్త చట్టబద్ధ అవకాశాలనూ కల్పించటాన్ని, భారత కార్మిక వర్గం నూరేళ్లుగా పోరాడి సాధించుకున్న హక్కులను నిర్దాక్షిణ్యంగా రద్దు పరచటాన్ని ఇరువురూ ఏకగ్రీవంగానే బలపరిచారు. ప్రజా వ్యతిరేక అంశాలలో ఐక్యత, అధికార దాహం, సంపదల కేంద్రీకరణ విషయంలో పోటీ, దాని కోసం న్యాయ వ్యవస్థను కూడా వివాదాల లోకి లాగి ఉపయోగించుకుంటున్నారు. ఇదీ నేటి పరిస్థితి!!
                                                                         - దివి కుమార్‌ (సెల్‌ : 94401 67891)