Jan 10,2021 17:57

ఏడాదిపాటు ఎదురుచూపు
గాలిలో ఎగిరి, నీటిలో తేలి
నేలపై నడచి ఏ మార్గాన
నీవు వస్తావోనని
ఉన్న రెండు కళ్ళనూ
నింగికి అతికిచ్చి నిరీక్షిస్తున్నా !

శిథిలమైన దేహంలో
జీవం వున్నది నయనాలలోనే కదా
ఈ పల్లెతల్లి తనువులో
అవయాలు ఒక్కొక్కటిగా
విరిగి రాలిపోతున్నాయి నాన్నా

నీకు అక్షరాలు నేర్పిన
''బడి'' మూతబడి
నిన్ను ఊరేగించిన
ఎడ్లబండి మూలబడి
నిను దీవించిన
గుడిలోని దీపం కొండెక్కి
నీ దాహం తీర్చిన
చేదబావి పూడిపోయి
నీకు బువ్వపెట్టిన అరక విరిగి
దుక్కిదున్నిన ఎద్దులు ఊరుదాటి
పండితులు కూర్చున్న
అరుగులు మాయమై
నీవు ఆడిన ఆటలన్నీ అటకెక్కి
ఉనికిని కోల్పోయాయి కన్నా!

నీకు తెలిసిన
హరికథలు వీధినాటకాలు
కోలాటాలు చెక్కభజనలు
ఏవీ నేడు కానరావు

ఒక్కొక్క అంగం రాలినా
నీ అడుగుల సవ్వడికి
నీ పాద స్పర్శకు
ఎంతగా ఎదురుచూస్తున్నానో!

నువ్వు వస్తే
కలల పండుగ కదలొచ్చినట్లు
మనసు పులకరించి పరవశిస్తాను
భోగిలోని భోగమంతా నాదే
సంక్రాంతిలోని సంబరమంతా నాదే
కనుమలోని కమనీయం నాదే

నాలో ఎన్ని రాలిపోయినా
కళ్ళలో మాత్రం
నీ కోసం ప్రాణం నిలుపుకొని
గుమ్మానికి మామిడితోరణాలు కట్టి
గడపకు పసుపురాసి బొట్లు పెట్టి
ముగింట్లో కల్లాపిచల్లి
ముత్యాలముగ్గులు వేసి
గుమ్మడిపూలతో గొబ్బెమ్మలు పెట్టి
ఎదురుచూస్తున్నా
ఏడాదికి ఒక్కసారి సంక్రాంతికి
రారా కన్నా
నీవు వస్తేనే నాకు ''పెద్ద పండుగ''

                                      * సురేంద్ర రొడ్డ, 9491523570