Oct 11,2023 14:46
  • కావూరివారిపాలెంలో అక్రమ ఇసుక రవాణా ఆపాలి
  • రైతుల భూములను పరిశీలించిన పోరాట కమిటీ
  • సొసైటీ భూములు క్రయ, విక్రయాలు చట్టరీత్యా నేరం 
  • మద్దతు తెలిపిన టిడిపి, ప్రజాసంఘాల నేతలు

 ప్రజాశక్తి - చీరాల : యస్టీ,యస్టీ,బీసీ సొసైటీ రైతుల భూములు క్రయ విక్రయాలు చట్టరీత్యా నేరం అని ఆ భూములలో అక్రమ ఇసుక త్రవ్వకాలకు పాల్పడుతున్న దళారులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసి పంట భూములను రక్షించాలని సిపిఎం నాయకులు ఎన్ బాబురావు, పి కొండయ్య లు డిమాండ్ చేశారు. మండలంలోని కావూరివారి పాలెం పంచాయతీ పరిధిలో సొసైటీ రైతుల భూముల్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల భూములను బుధవారం ఆ ప్రాంత చిన్న సన్నకారు రైతులకు మద్దతుగా పలు పార్టీ ప్రజాసంఘాల నాయకులు కలిసి  పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు రైతుల భూములకు రక్షణ కల్పించాల్సిన అధికార పార్టీ నేతలు తమ పదవులను అడ్డం పెట్టుకొని ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.మంత్రి మేరుగ నాగార్జున మరియు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి  అండదండలతో  వారి అనుచరులు ఇస్తా రీతిగా రైతుల భూములను జెసిబిలతో, రాత్రికి రాత్రి తవ్వకాలు జరిపి లారీల ద్వారా ఊళ్లు దాటిచేస్తున్నారని అన్నారు. అడ్డదారిలో క్వారీలు ఏర్పాటు చేసి సుమారు 25 అడుగుల మేర ఇసుక తవ్వకాలు జరపటం వల్ల భూగర్భ జలాలతో క్వారీలు నిండిపోయి రైతుల పంట భూములకు చుక్క నీరు లేకుండా ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అన్నారు. మరోవైపు రాయల్ మెరైన్ ఆక్వా పరిశ్రమ నుండి వెలువడుతున్న వ్యర్ధాలను భూములలోకి వదలడం వల్ల భూగర్భ జలలు అన్ని కలుషితమై ఉప్పునీరుగా మారి పంట భూములు పూర్తిగా దెబ్బతింటున్నాయని అన్నారు.సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్ ను సంప్రదించి రైతుల సమస్యలను వివరిస్తాము అన్నారు.
తక్షణమే ప్రభుత్వ ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతుల భూములను పరిశీలించి పంట పొలాలను రక్షించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులందరితో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సన్నహాలు చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ప్రజా వేదిక నాయకులు గుమ్మడి ఏసు రత్నం,ఊటుకూరు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు గజవల్లి శ్రీను, శేఖర్, గంజి పురుషోత్తం, కావూరివారి పాలెం మాజీ ఎంపిటిసి శ్రీనివాసరావు, పోరాట కమిటీ నాయకులు రమణయ్య దుడ్డు అంకమ్మరావు కేసర సురేషు మిక్కిలి పుల్లయ్య వై వెంకటేశ్వర్లు జంగం దానియేలు ఎం తారక్ బి లూథర్ బలగాని సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.