Oct 26,2023 09:05
  •  బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుతో పెరగనున్న కాలుష్యం
  • ఆందోళనలో అనకాపల్లి జిల్లా తీర ప్రాంతవాసులు

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి జిల్లాలోని సముద్రతీరం రసాయన పరిశ్రమల కేంద్రంగా మారనుంది. ఇప్పటికే నక్కపల్లి హెటిరో డ్రగ్స్‌, పరవాడ ఫార్మా, అచ్యుతాపురం సెజ్‌లోని పలు పరిశ్రమల కాలుష్యంతో మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బతగిలింది. ఈ నష్టం చాలదన్నట్లు కాకినాడ సెజ్‌ నుంచి బల్క్‌ డ్రగ్‌ పార్కును నక్కపల్లికి తరలించాలని సెప్టెంబర్‌ 20న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే సముద్రంలో చేపలు వేటాడే మత్స్యకారులు, ఆ వేట ఆధారంగా బతుకుతున్న ఇతర వృత్తిదారుల బతుకులపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 73 కిలోమీటర్ల తీర ప్రాంతంలోని పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో దాదాపు 20 వేల మత్స్యకారులకు ఉపాధి ప్రశ్నార్థకంగా మారనుంది. బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటును ప్రధానంగా మత్స్యకారులు, ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించకుండా కొత్త ఎత్తులు ప్రారంభమయ్యాయి. అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద రూ.389 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ హార్బర్‌, నక్కపల్లి మండలం రాజయ్యపేట, దొండవాక తీరం వద్ద రూ.25 కోట్ల చొప్పున ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. రసాయన, ఔషధ పరిశ్రమల కాలుష్యంతో సముద్రంలో చేపల వేట గణనీయంగా తగ్గి, జీవనోపాధి పోయిందని నక్కపల్లి, ఎస్‌.రాయవరం, అచ్యుతాపురం మండలాల్లోని మత్స్యకారులు ఆందోళనల బాట పట్టినా ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. ఈ కాలుష్య నష్టం సరిపోదన్నట్లు కాకినాడ సెజ్‌లో మత్స్యకారులు, ప్రజలు వ్యతిరేకించిన బల్క్‌ డ్రగ్‌ పార్కును నక్కపల్లికి తరలించే ప్రయత్నం చేస్తోంది.

  • ప్రభుత్వ ఆలోచన ఇలా...

బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు ముందే ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి నిర్మాణాలను చూపి మత్స్యకారుల నుంచి వచ్చే వ్యతిరేకతను తగ్గించుకొని బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు పనులను ముమ్మరం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మత్స్యకారుల బతుకులను ప్రభుత్వం ఏ మాత్రమూ పరిగణనలోకి తీసుకోకుండా కింద ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను చూపి, పైన రసాయన, ఔషధ పరిశ్రమలకు అనుమతులివ్వనుంది. హెటిరో పరిశ్రమతో రాజయ్యపేట, బోయపాడు, పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక, అమలాపురం, డిఎల్‌.పురం, బంగారయ్యపేట గ్రామాల మత్స్యకారులు, కంపెనీకి ఆనుకొని ఉన్న అయ్యన్నపాలెం, నల్లమట్టిపాలెం, బుచ్చిరాజుపేట, ఎన్‌.నర్సాపురం, చందనాడ, జానకయ్యపేట, సిహెచ్‌ఎల్‌ పురం ప్రజలు నిరంతరం కాలుష్య ప్రభావానికి గురవుతున్నారు. అయినా, కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. విశాఖ-చెన్నరు ఇండిస్టియల్‌ కారిడార్‌లో భాగంగా నక్కపల్లి పారిశ్రామిక క్లస్టర్‌ ఏర్పాటులో ఎపిఐఐసి సేకరించిన 4,500 ఎకరాలు భూమిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.

  • తాజాగా ఏం జరుగుతోంది?

పూడిమడక వద్ద 37 ఎకరాల విస్తీర్ణంలో రూ.389 కోట్లతో నిర్మించే ఫిషింగ్‌ హార్బర్‌కు టెండర్లు ప్రక్రియ పూర్తయింది. నిర్మాణ పనులకు సామగ్రి తరలింపు, భవిష్యత్తులో వాహన రాకపోకలకు సమస్యలు తలెత్తకుండా శాశ్వత వెడల్పు రహదారికి అవసరమైన భూమిని సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. హార్బర్‌ పనులు పూర్తయితే వెయ్యి వరకు మెకనైజ్డ్‌ బోట్లు పెట్టుకొనే అవకాశముంది. రాజయ్యపేట ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు కనీస అవసరమైన మూడెకరాల భూమిని మార్కెట్‌ రేటు చెల్లించి ఎపిఐఐసి నుంచి తీసుకోవాలని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దొండవాక వద్ద భూమి లేకపోవడంతో భూమికి భూమి ఇచ్చి రైతుల నుంచి మూడెకరాలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. భూమి సమస్య పరిష్కారం అయిన వెంటనే నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టనుంది.