
- ప్రతి మత్స్యకారుడికి జిఎస్పిసి నష్టపరిహారం అందించాలని డిమాండ్
ప్రజాశక్తి - యానాం(కాకినాడ) : యానాం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. సముద్రంలో ఓఎన్జిసి సంస్థ గ్యాస్ పైప్ లైన్ వేస్తున్న నేపథ్యంలో యానాం మత్స్యకారులకు 2022-23 సంవత్సరానికిగాను ఓఎన్జీసీ సంస్థ పరిహారం పంపిణీ కోసం గ్రామస్థాయి కమిటీ సర్వే ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను ఇటీవల మత్స్యశాఖ విడుదల చేసింది.ఈ నేపథ్యంలో చేపలవేట,ఒంటరి మహిళ,పిల్లలున్న మహిళల జాబితాలో 1150 మందిని అర్హులుగా ప్రకటించింది. ఇతర వృత్తుల్లో ఉన్న మత్స్యకారులను అనర్హులుగా, ప్రకటించడంతో ఈ ఆందోళన చేపట్టినట్లు ఆందోళనకారులు తెలిపారు. యానాం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్ధాని దినేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సేన జేఏసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి సత్తిబాబు,డీఎంకే ప్రతినిధి అరదాడి పోసియ్య పాల్గొని తమ మత్స్యకారుల సమస్యను పరిష్కరించాలంటూ ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర తరహాలోనే యానాం మత్స్యకారులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆంధ్రలో నాలుగు విడతలుగా నష్టపరిహారం అందించారని కానీ యానాంలో అలా జరగడం లేదని తెలిపారు.చమురు సంస్థలు మత్స్యకారులను వేటకు వెళ్లకుండా చేసి ముడి సరుకులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటే ప్రతి మత్స్యకారుడికి నష్టపరిహారం ఎందుకు ఇవ్వరని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు ఆరోపించారు. ఓఎన్జిసి సంస్థ ప్రభుత్వానికి నష్టపరిహారం జమ చేసినప్పటికీ మత్స్యకారుడి ఖాతాలో ఎందుకు జమ చేయడం లేదని అన్నారు.ప్రతి మత్స్యకారుడికి నష్టపరిహార ఇవ్వకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.సుమారు 7 వేల మంది లబ్ధిదారులు ఉండగా 2 వే మందిని పైగా జాబితా నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.13 సంవత్సరాలుగా పుదుచ్చేరి ప్రభుత్వాలు మత్స్యకారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మత్స్యకారులకు అండగా ఉండాలని కోరారు. అనంతరం ఆర్‌ఏఓ మునిస్వామి ఆందోళనకారులతో చర్చించారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. అనంతరం మత్స్యకారులు వినతి పత్రాన్ని అందించారు. ఇదే విషయాన్ని ముందుగా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి గొంతియ్యని జాబితాలో పేర్లు లేవని అడగగా మరోసారి గ్రామస్థాయి కమిటీ సర్వే నిర్వహించి రెండో విడతలో వచ్చేలా చేస్తానని సమాధానం ఇచ్చారని తెలిపారు.