
- బోటు తిప్పేందుకు పెరిగిన ఖర్చులు
- డీజిల్ ధర రెట్టింపైనా సబ్సిడీ పెంచని ప్రభుత్వం
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : సముద్రంపై చేపల వేటనే నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల జీవనం క్రమంగా భారంగా మారుతోంది. కడలిలో ఏర్పడుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చేపల ధరల తగ్గుదల, దళారుల ప్రమేయం, వేటకు అయ్యే ఖర్చులు పెరగడం వెరసి వారి జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నాయి. పలు సందర్భాల్లో వేట సాగని పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న డీజిల్ ధరలో రాయితీని పెంచడంతోపాటు, సబ్సిడీపై ఇస్తున్న డీజిల్‌ను పెంచాలని మత్స్యకారులు కోరుతున్నారు.
కాకినాడ జిల్లాలో తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, తాళ్లరేవు, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి తదితర 13 మండలాల్లో 144 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. కోస్తా తీర ప్రాంతం గుండా 3.55 లక్షల మంది నివసిస్తుండగా, చేపల వేట ద్వారా సుమారు 66 వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. 600 వరకూ మెకనైజ్డ్, మూడు వేలకుపైగా మోటరైజ్డ్ బోట్లపై మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. సముద్రంలో ఎటువంటి ఆటంకాలూ లేనప్పుడు వేటకు వెళ్లి వీరంతా కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే వారు పస్తులుండాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాయుగుండాలు, తుపానులు వచ్చినప్పుడు రోజుల తరబడి వేటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని సందర్భాల్లో నెలంతా ఖాళీగానే ఉంటున్నామని, అయినా తమను ఎవరూ ఆదుకోవట్లేదని మత్స్యకారులు వాపోతున్నారు.
డీజిల్ ధర రెట్టింపు
లీటర్ డీజిల్ ధర రూ.50 ఉన్నప్పుడు ప్రభుత్వం సబ్సిడీపై అందించేది. ప్రస్తుతం డీజిల్ లీటరు రూ.100కి పెరిగినా అప్పటి సబ్సిడీ రూ.9 మాత్రమే నేటికీ అందిస్తోంది. కనీసం రూ.30 అయినా ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. మత్స్య సంపద అంతగా లభ్యం కానీ పరిస్థితుల్లో సముద్రంలో సుదూర ప్రాంతం వేటకు వెళ్లాల్సి వస్తోంది. నెలకు నాలుగుసార్లు వేటకు వెళితే మోటరైజ్డ్ బోట్లకు దాదాపు రెండు వేల లీటర్లు డీజిల్ వినియోగం అవుతోంది. ప్రభుత్వం 300 లీటర్లను మాత్రమే సబ్సిడీపై అందిస్తోంది. కనీసం మిగతా 2లో 1,500 లీటర్లయినా సబ్సిడీపై ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. మెకనైజ్డ్ బోట్లకు ఇస్తోన్న మూడు వేల లీటర్ల డీజిల్ సబ్సిడీని ఐదు వేల లీటర్లకు పెంచాలని కోరుతున్నారు.
తగ్గుతున్న ఉపాధి
గతం కంటే చేపల వేట తగ్గుతూ వస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు. తుని, తొండంగి, తాళ్లరేవు, కాకినాడ రూరల్ వంటి తీర ప్రాంతాల్లో హెచరీలతోపాటు రొయ్యల చెరువులు, ప్రాసెసింగ్ యూనిట్లు విపరీతంగా పెరిగాయి. వాటి వ్యర్థాలను సముద్రంలోకి నేరుగా వదిలేస్తున్నారు. దీంతో, మత్స్య సంపదకు తీవ్రంగా నష్టం జరుగుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీంతో, మత్స్యకారులకు వేట సరిగా సాగడం లేదు.

ఖర్చులు రెట్టింపు అయ్యాయి
ఇంధనం, ఐస్‌తో పాటు ఇతర ఖర్చులు రెట్టింపయ్యాయి. చాలా దూరం వేటకు వెళ్లాల్సి వస్తుండడంతో డీజిల్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రతికూల పరిస్థితుల్లో వేట చేయలేక అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
- చోడిపల్లి ప్రసాద్, మత్స్యకారుడు, ఉప్పాడ, యు.కొత్తపల్లి మండలం

జిల్ సబ్సిడీ పెంచాలి
ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఏ మాత్రమూ సరిపోవడం లేదు. నెలకు డీజిల్ వినియోగం ఎక్కువైంది. వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు అప్పులు చేయాల్సిన దుస్థితికి వెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సబ్సిడీని పెంచడంతోపాటు ఇస్తున్న లీటర్ల సంఖ్యను కూడా పెంచాలి. - తుమ్మల రమేష్, మత్స్యకార నాయకుడు, కాకినాడ