
వారణాసి : ప్రముఖ విద్యా సంస్థల క్యాంపస్‌ల్లో కూడా విద్యార్థినులకు భద్రత లేదా అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) , బిహెచ్‌యు ఘటనను శుక్రవారం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కేంద్రం సమాధానమివ్వాలని కోరారు. యుపి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ప్రియాంకగాంధీ తీవ్రంగా ఖండించారు. ఐఐటి వంటి ప్రముఖ యూనివర్శిటీ క్యాంపస్‌లలో భద్రతపై కేంద్రం సమాధానమివ్వాలని అన్నారు. ''వారణాసిలోని ఐఐటి బిహెచ్‌యు విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. యూనివర్శిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థినిపై దాడి ఆందోళన కలిగించింది. సిగ్గులేని దుండగులు ఈ ఘటనను వీడియో కూడా తీశారు. ప్రముఖ విద్యా సంస్థల క్యాంపస్‌లు కూడా ఇప్పుడు సురక్షితంగా లేవా. ప్రధాని మోడీ నియోజకవర్గంలో ఓ విద్యార్థిని తన సొంత విద్యాసంస్థలో ఇకపై నిర్భయంగా నడవడం కూడా సాధ్యం కాదా '' అని ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై రాజ్‌పుతానా హాస్టల్ దగ్గర వందలాది మంది విద్యార్థులు గత రెండు రోజులుగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. బయటి వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి రాకుండా నిషేధం విధించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. బిహెచ్ యు క్యాంపస్ నుంచి ఐఐటి క్యాంపస్‌ను వేరు చేయాలని, మధ్యలో గొడ కట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీలో సెక్యూర్టీని పటిష్టం చేస్తామని, మరిన్ని సిసిటివిలను ఏర్పాటు చేయనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యార్థుల కదలికలపై కూడా ఆంక్షలు విధించనున్నట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి కర్మన్ బాబా గుడి దగ్గర వాకింగ్‌కు వెళ్లింది. బైక్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను ఓ కార్నర్‌కు తీసుకువెళ్లి కిస్ చేయడంతో పాటు దుస్తులు తొలగించారు. వీడియో తీసి.. 15 నిమిషాల తర్వాత వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థిని ఫిర్యాదు మేరకు వారణాసిలోని లంక పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 354 తో పాటు ఐటి చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.