- హిందుస్తాన్ సమాచార్‌తో ప్రసార భారతి ఒప్పందం
- పిటిఐ, యుఎన్‌ఐలకు గుడ్‌బై
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రభుత్వ వార్తా సంస్థలు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో(ఎఐఆర్)ల్లో ఇక నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) వార్తలే కనిపించనున్నాయి.. వినిపించనున్నాయి. దూరదర్శన్, ఎఐఆర్‌లను నడిపే ప్రసారభారతి రోజువారీ వార్తలు, కథనాలు కోసం హిందుస్థాన్ సమాచార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడమే ఇందుకు కారణం. హిందుస్థాన్ సమాచార్ అనేది ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వార్తా సంస్థ. హిందుస్థాన్ సమాచార్‌తో ఒప్పందం కోసం అతిపెద్ద ప్రొఫెషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ)తో సభ్యత్వాన్ని ప్రసార భారతి రద్దు చేసుకుంది. వాస్తవానికి 2017 నుంచి కూడా ప్రసార భారతికి 'మూల్యంకన పద్ధతి'న ఉచితంగా హిందుస్థాన్ సమాచార్ వార్తలు అందిస్తుంది. అయితే ఈ నెల 9న ఈ రెండు సంస్థలు మధ్య రూ. 7.7 కోట్ల విలువైన అధికారిక ఒప్పందం కుదిరింది. రెండు సంవత్సరాల వ్యవధి కలిగిన ఈ ఒప్పందం 2025 మార్చిలో ముగుస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రసార భారతికి ప్రతీరోజూ కనీసం 100 వార్త కథనాలను హిందుస్థాన్ సమాచార్ అందచేయాలి. ఇందులో కనీసం 10 జాతీయ వార్తలు, 40 స్థానిక కథనాలు ప్రాంతీయ భాషల్లో ఉండాలి.
హిందుస్థాన్ సమాచార్‌తో ప్రసార భారతిను అధికారంగా చేర్చడం కోసం నరేంద్ర మోడీలోని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి పిటిఐ, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యుఎన్‌ఐ)తో చేడుగా వ్యవహరిస్తుంది. ఈ రెండు ఏజెన్సీలు అసమంజసమైన సబ్‌స్క్రిప్షన్ ఫీజులను వసూలు చేస్తున్నాయని, ఈ సంస్థల సేవలను రద్దు చేయాలని ప్రసారభారతిని కొన్ని ఏళ్ల కిందటే ఆదేశించింది. రెండు సంస్థలు ఏడాదికి రూ. 15.75 కోట్లు ఫీజులను వసూలు చేస్తున్నాయని, పిటిఐ ఫీజు ఇందులో రూ. 9 కోట్లు వరకూ ఉందని కేంద్రం తెలిపింది. అలాగే ఈ రెండు సంస్థలు కూడా 'నిటారుగా' ఉన్న వార్తలు అందిస్తున్నాయని, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వార్తలను అందించే సంస్థ కావాలని కూడా కేంద్రం కోరుకుందని కూడా సమాచారం.
2016లో పిటిఐ ప్రధాన సంపాదకులుగా ఎంకె రజ్దాన్ పదవీకాలం ముగిసిన తరువాత ఆ స్థానంలో తమ చెప్పుచేతల్లో ఉండే వ్యక్తిని నియమించడం కోసం మోడీ ప్రభుత్వం లాబీయింగ్ జరిపిందని, అయితే పిటిఐ బోర్డు అవి పట్టించుకోకుండా ప్రముఖ జర్నలిస్టు విజరు జోషిని ఆ స్థానంలో నియమించింది. 2017లోని మధ్య ఢిల్లీలో ఉన్న పిటిఐ భవనం నుంచి ప్రసారభారతి కార్యాలయం ఖాళీ చేసిన తరువాత ఈ రెండు సంస్థల మధ్య సత్సంబంధాలు లేవని సమాచార, ప్రసార శాఖకు చెందిన ఒక మాజీ కార్యదర్శి మీడియాకు తెలిపారు. పిటిఐ అద్దె ఎక్కువగా వసూలు చేస్తుందని ఈ భవనాన్ని ప్రసార భారతి ఖాళీ చేసింది. అలాగే దేశ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తుందని కూడా పిటిఐపై కేంద్రం ఆరోపణలు చేసింది. దేశంలోని చైనా రాయబారి, చైనాలోని భారత్ రాయబారితో పిటిఐ ఇంటర్వ్యూలు చేయడం కేంద్రానికి కోపం తెప్పించింది. ఈ పిటిఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌కు ప్రసారభారతి సీనియర్ అధికారి సమీర్ కుమార్ లేఖ కూడా రాసారు. ఈ వార్తలు భారత దేశ ప్రాదేశికతను బలహీనపరిచాయని ఆరోపించారు. ఎట్టకేలకు 2020లో అక్టోబర్‌లో పిటిఐ సభ్వత్వాన్ని ప్రసారభారతి రద్దు చేసుకుంది.
ప్రముఖ వార్త సంస్థ పిటిఐను తొలగించి, దాని స్థానంలో అంతగా తెలియని హిందుస్థాన్ సమాచార్‌తో ఒప్పందం కుదుర్చకోవడంపై అనేక విమర్శలు వెళ్లువెత్తున్నాయి. ప్రభుత్వ సానుకూల వార్తలకు, కాషాయ వార్తలను ప్రచారం చేయడం కోసమే ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందని ఆరోపిస్తున్నారు.
1948లో హిందుస్థాన్ సమాచార్‌ను ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వాల్కర్‌తో కలిసి ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ ప్రచారక్, విశ్వ హిందూ పరిషత్ సహా వ్యవస్థాపకుడు శివరామ్ శంకర్ ఆప్టే స్థాపించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ప్రకటనలు విరివిగా వస్తున్నాయి. దీంతో జుండేవాలన్‌లో ఉన్న తన చిన్న కార్యాలయాన్ని నోయిడాలోని పెద్ద ఆఫీసుకు మార్చాలని కూడా యోచిస్తుంది. 1986లో ఆర్థిక సంక్షోభంతో దీనిని మూసివేశారు. అయితే వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయం 2002లో ఆర్‌ఎస్‌ఎస్ దీనిని పునరుద్దరించింది.










