
ముంబై : గత కొన్నిరోజులుగా మహారాష్ట్రలో మత ఘర్షణలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఫొటోని ఓ వ్యక్తి తన వాట్సాప్ ప్రొఫైల్‌గా పెట్టుకున్నాడని హిందూ సంస్థ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల మేరకు ముంబై పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఓ అధికారి తెలిపారు. అతను మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ యొక్క అవుట్‌లెట్‌లో పనిచేస్తున్నారు. ఇతన్ని మహారాష్ట్రలోని వాషిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పోలీసు అధికారి ముందు హాజరుకావడానికి అతనికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41 ఎ కింద అతనికి నోటీసు అందించడం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, ఔరంగజేబు ప్రొఫైల్ పిక్చర్ స్క్రీన్ షాట్‌ను హిందూ సంస్థ పోలీసులకు సమర్పించింది. దీంతో అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 298, 153-ఎ కింద అతనిపై కేసు నమోదు చేశామని, దీనిపై తదుపరి విచారణ జరుగుతుందని పోలీసు అధికారి వెల్లడించారు. మహారాష్ట్రలో ఔరంగజేబు, టిప్పు సుల్తాన్‌లను కీర్తిస్తూ పోస్టర్లు కానీ, సోషల్‌మీడియాలో ఆడియోలు వైరల్ అయినా హిందూత్వమూకలు దాడులకు తెగబడుతున్నాయి. గత బుధవారం కొల్హాపూర్ నగరంలో టిప్పు సుల్తాన్‌కి సంబంధించిన ఆడియో తన సోషల్‌మీడియా స్టేటస్‌గా ఉపయోగించిన వ్యక్తిపై హిందూత్వమూకలు రాళ్లదాడి చేశారు. ఇక సంగ్మార్ టౌన్‌లో అహ్మద్‌నగర్‌లో ఔరంగజేబు ఫొటో ప్రదర్శనలకు వ్యతిరేకంగా సకాల్ హిందూ సమాజ్ సంస్థవాళ్లు ర్యాలీ నిర్వహించి ఆ సందర్భంగా రాళ్లు రువ్వారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మహారాష్ట్ర సిఎం, డిప్యూటీ సిఎం ఫడ్నవీస్ శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.