- గాజాలోని ఇండోనేషియన్ ఆస్పత్రిపైనా దాడి శ్రీ 12మంది మృతి
- అరబ్, ముస్లింలీగ్ మంత్రుల టూర్ శ్రీ జిన్‌పింగ్, మాక్రాన్ ఫోన్‌కాల్
- 24 గంటల్లో నలుగురు జర్నలిస్టులు, ముగ్గురు మీడియా సిబ్బంది మృతి
గాజా : గాజాలో ఇజ్రాయిల్ దాడులు మరింత విస్తృతమవుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ బలగాల భీకర దాడులకు మరో ఆస్పత్రి బలైంది. గాజాలోని ఇండోనేషియా ఆస్పత్రిపై దాడి జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దాడుల్లో 12మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి లోపల ఆశ్రయం పొందినవారు ఆస్పత్రి వదిలి వెళ్లిపోవడానికి ప్రయ త్నించగా వారిపై బలగాలు కాల్పులు జరిపాయని, మృతదేహాలన్నీ ఎక్కడికక్కడ నేలపై చెల్లాచెదురుగా పడి వున్నాయని, మృతదేహాలను ఖననం చేసే పరిస్థితి కూడా లేదని ఆ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి చుట్టూ ఇజ్రాయిల్ ట్యాంక్‌లు చుట్టుముట్టాయి. ఆస్ప త్రిలో దృశ్యాలు బీభత్సంగా వున్నాయి. ఐసియుల్లోని నవజాత శిశువులను వైద్యం కోసం ఈజిప్ట్‌కు తరలించారు. ఇప్పటివరకు అల్‌షిఫా ఆస్పత్రి నుండి నెలలు నిండకుండా పుట్టిన 31మంది శిశువులను తరలించినట్లు డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది.
మరోవైపు అల్ కువైట్ యుఎన్ స్కూలును కూడా తగలబెట్టేశారు. గాజా ప్రజలు కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ మృతుల సంఖ్య ఎంతనేది ఇంకా తెలియరాలేదు. ఈ దాడిని ఇండోనేషియా విదేశాంగ మంత్రి రెటినో మార్సుది ఖండించారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఇది తీవ్రంగా ఉల్లంఘించడమేనన్నారు. అన్ని దేశాలు ముఖ్యంగా ఇజ్రాయిల్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన దేశాలన్నీ తన పలుకుబడిని, సామర్ధ్యాలను ఉపయోగించి ఈ దారుణాలను ఆపేలా చూడాలని రెటినో కోరారు.
మరోవైపు అదనపు ప్రాంతాలకు తమ ఆపరేషన్‌ను విస్తరిస్తున్నామని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరించింది. జాబాలియా శరణార్ధ శిబిరానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అక్కడ నుండి ఖాళీ చేయాలని ఆదేశించింది. ఇదిలావుండగా, ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్‌కు చెందిన సరుకుల రవాణా నౌకను యెమెన్‌లోని హుతీ రెబెల్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులోని 25మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. దీంతో ఘర్షణలు ఇతర ప్రాంతాలకూ వ్యాపిస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అరబ్, ముస్లిం మంత్రుల టూర్
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించా లని అరబ్, ముస్లిం మంత్రులు సోమవారం పిలుపు నిచ్చారు. గాజాలో ఘర్షణలను నివారించేందుకు జరుపుతున్న పర్యటనలో భాగంగా సోమవారం వారు బీజింగ్‌లో పర్యటించారు. గాజాలో మానవతా సంక్షోభం తలెత్తకుండా ప్రపంచ దేశాలు అత్యవస రంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైం దని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నా రు. గాజాలో యుద్దాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించేందుకు గల అవకాశాలపై మంగళవారం మాస్కోలో అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసి) విదేశాంగ మంత్రులు సమా వేశం కానున్నారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఫ్రాన్స్‌్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ సోమవారం గాజాలో పరి స్థితులపై ఫోన్‌లో చర్చించారు. మరింత తీవ్రమైన మానవతా సంక్షోభం పెచ్చరిల్లకుండా నివారిం చడానికి చర్యలు తీసుకోవడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. నవంబరు 20ని ప్రపంచ బాలల దినోత్సవంగా పాటిస్తారు. బాలల హక్కులు, భద్రత, విద్య, ఆరోగ్యం, సంతోషం కోసం అంతర్జా తీయంగా నిర్వహించే ఈ రోజున గాజాలో పరిస్థితి దారుణంగా వుంది. ఇప్పటివరకు 5,500 మంది చిన్నారులు దాడులకు బలయ్యారు. ప్రతి పది నిముషాలకు ఒక చిన్నారి కన్నుమూశాడు.
నలుగురు జర్నలిస్టులు, ముగ్గురు మీడియా సిబ్బంది మృతి
గడచిన 24గంటల్లో ఇజ్రాయిల్ జరిపిన క్రూర మైన దాడుల్లో నలుగురు జర్నలిస్టులు, ముగ్గురు స్థానిక మీడియా సిబ్బంది మరణించారు. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ దాడుల్లో దాదాపుగా 40 మంది జర్నలిస్టులు మరణించారు. సెంట్రల్ గాజాలోని అల్ బురీజ్ శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడిలో అక్కడ ఆశ్రయం పొందుతున్న సారి మన్సూ ర్, హసౌనెహ్ సలీం మృతి చెందారు. బిబిసికి చెందిన మరో ప్రముఖ పాత్రికేయు డు, పాలస్తీనా రాజకీయ వ్యవహారాల విశ్లేషకుడు ముస్తఫా అల్ సవాఫ్ స్థానిక ఫోటో జర్నలిస్ట్ ముసాబ్ అషౌర్, అల్ అక్సా రేడియోలో పనిచేసే అబ్దుల్‌హమిద్ అవద్, అల్ అక్సా టెలివిజన్ ఛానెల్‌కి చెందిన అమర్ అబు హయ్యా ఈ దాడుల్లో చనిపోయారు.. మృతుల్లో ప్రెస్ హౌస్ డైరెక్టర్ బిలాల్ జదల్లా కూడా ఉన్నారు. గాజా సిటీలోని ఆయన కారుపై బాంబులు వేసినట్లు హమాస్ కమ్యూని కేషన్స్ ఆఫీస్ తెలిపింది. గాజాపై ఇజ్రాయిల్ దాష్టీకాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న జర్నలిస్టులు తమ వార్తా కవరేజీ సందర్భంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నా రని పేర్కొంది.