Oct 27,2023 10:38
  • గాజాలో 20 రోజులుగా ఇజ్రాయిల్‌ మారణకాండ
  • ఇప్పటి వరకు 7028 మంది మృతి
  • వీరిలో 3000 మంది చిన్నారులే

గాజా : అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఏమాత్రం చెవికెక్కించుకొని ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. గాజాలో ఎటుచూసినా కన్నీటిధారలే కనిపిస్తున్నాయి. చంటి బిడ్డలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఇజ్రాయిల్‌ దాడులకు బలైపోతున్నవారి సంఖ్య పెరిగిపోతూనేవుంది. పాత్రికేయులు నేలకొరుగుతున్నారు. క్షతగాత్రులతో నిండిపోతున్న ఆసుపత్రుల్లో సౌకర్యాలు, మందుల కొరతతో వైద్య సేవలు స్థబించిపోవడంతో రోధనలు మిన్నంటుతున్నాయి. సకాలంలో వైద్యం అందక తనువు చాలిస్తున్న వారెందరో. మానవ సాయాన్ని అడ్డుకోవద్దంటూ ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసినా ఇజ్రాయిల్‌ పెడచెవిన పెడుతోంది. ఏమాత్రం కనికరం లేకుండా గాజా స్ట్రిప్‌లో యథేశ్చగా మారణకాండ కొనసాగిస్తోంది. హమస్‌ సాయుధులను మట్టుబెట్టే సాకుతో ఇజ్రాయిల్‌ చేపట్టిన వైమానిక దాడులకు 20 రోజులవుతున్నా బుధవారం కూడా ఈ దాష్టీకాలు కొనసాగాయి. పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ, పాలస్తీనా రెడ్‌క్రిసెంట్‌ సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం..ఇజ్రాయిల్‌ దాడుల్లో ఒక్క గాజా స్ట్రిప్‌లోనే బుధవారం సాయంత్రం 4 గంటల సయమానికి 7028 మంది పౌరులు చనిపోయారు. వీరిలో దాదాపు 3000 మంది చిన్నారులు కాగా, మరో 1700 మంది మహిళలున్నారు. 400 మంది వృద్ధులు కూడా ఇజ్రాయిల్‌ దాడులకు బలైపోయినవారిలో ఉన్నారు. దాదాపు 17500 మంది పౌరులు గాయపడ్డారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో 103 మంది చనిపోగా, 1836 మంది గాయపడ్డారు. కాగా ఇజ్రాయిల్‌పై హమస్‌ జరిపిన దాడుల్లో 1405 మంది చనిపోగా, 5431 మంది గాయపడ్డారని ఇజ్రాయిల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ వెల్లడించింది.
 

                                                                             బలైపోతున్న పాత్రికేయులు

గాజాపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో పాత్రికేయులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25 మంది పైగా పాత్రికేయులు చనిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం రాత్రి జరిగిన ఇజ్రాయిల్‌ దాడుల్లో ఆల్‌ జజీరా జర్నలిస్టు, అరబిక్‌ బ్యూరో ఛీఫ్‌ వేల్‌ అల్‌ దహదౌV్‌ా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్‌ గాజాలోని ఇజ్రాయెల్‌ సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న నుసెరాత్‌ క్యాంప్‌ అతని ఇంటిని లక్ష్యంగా జరిగిన దాడిలో భార్య, కుమార్తె, కుమారుడిని కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దహదౌV్‌ా భార్య కుమారుడు, కుమార్తె గాజాలో నివసిస్తున్నారు. సురక్షితమైన ఈ ప్రాంతాన్ని టార్గెట్‌ చేసుకుని వైమానిక దాడులకు దిగబోతున్నాయనే విషయాన్ని భార్య తెలుసుకున్నారు. అక్కడి నుంచి తన కుమారుడు, కుమార్తెతో కలిసి పారిపోతుండగా వారిపై దాడి జరిగింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా శిథిలాల కింద సమాధి అయ్యారు. ఆస్పత్రిలో విగతజీవిగా పడి ఉన్న కుటుంబ సభ్యులను చూసిన దహదౌV్‌ా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. 'ఏమి జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. పిల్లలు, మహిళలు, పౌరులే టార్గెట్‌గా చేస్తున్న వరుస దాడులివి.
          ఇజ్రాయెల్‌ దాడులు నుసైరాత్‌తో సహా అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేస్తున్న దాడుల గురించి యార్మూక్‌ నుండి రిపోర్టు చేస్తున్నాను.. అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉన్న వారికి శిక్షించకుండా వదిలి పెట్టరనే అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు గాజాలో అమాయక పౌరులను విచక్షణారహితంగా లక్ష్యంగా చేసుకుని చంపడాన్ని అల్‌ జజీరా తీవ్రంగా ఖండించింది. మరికొంత మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆచూకీ కూడా గల్లంతు అయినట్టు సమాచారం.