న్యూఢిల్లీ : ఇజ్రాయిల్- పాలస్తీనా యుద్ధంపై ప్రధాని మోడీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ - సిసితో చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, మానవతా సంక్షోభంపై ఇరువురు నేతలు శనివారం ఫోన్ లో మాట్లాడారు. పెరుగుతున్న ఉగ్రవాదం, హింస, పౌరుల ప్రాణనష్టంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతను వాతావరణాన్ని త్వరగా పునరుద్ధరించాలని, బాధితులకు మానవ సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ చర్చలపై ఆదివారం ఉదయం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇరువురు నేతలు కొనసాగుతున్న యుద్ధంతో ఆ ప్రాంతం, మరియు ప్రపంచానికి ఎదురయ్యే చిక్కుల గురించి చర్చించినట్లు తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు ఈజిప్టు అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారితే వచ్చే ముప్పుపైనా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. సామాన్య పౌరుల జీవితాలు, ప్రాంతీయ భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండనుందో చర్చించినట్లు తెలిపారు.