Nov 10,2023 12:13

ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి : దివితాలూకా అమరవీరుల స్పూర్తితో రాష్ట్రానికి ద్రోహo చేసిన బీజేపీ, ఆ పార్టీకి వంత పడుతున్న వైసీపీ, టీడీపీ ,జనసేన పార్టీల విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏవీ నాగేశ్వరావు  అన్నారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం  ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర రెండో రోజు శుక్రవారం కృష్ణాజిల్లాలో కొనసాగింది. చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరుల్లో సభలు నిర్వహించారు. చల్లపల్లి ఏటీఎం సెంటర్ లో ఆ పార్టీ మండల కార్యదర్శి వై.మధు అధ్యక్షతన జరిగిన సభలో  నాగేశ్వరరావు మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని , కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మికులు, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టిందన్నారు. కార్మిక చట్టాలు నిర్వీర్యం చేసి నాలుగు కోడ్లు తీసుకు వచ్చిoదన్నారు. ప్రజలపై పన్నుల భారాలు పెంచిoదన్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా నియంత్రణకు చర్యలు తీసుకోలేదన్నారు .కేంద్రంలోని  మోడీ ప్రజావ్యతిరేక, కార్మిక ,రైతు వ్యతిరేక విధానాలకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు వంత పాడుతున్నా యన్నారు. ఈ పార్టీల వైఖరి ప్రజలకు తెలియజేస్తూ ప్రత్యామ్నాయ విధానాలను వివరిస్తూ రాష్ట్రంలో సీపీఎం ప్రజారక్షణ భేరి యాత్రలు నిర్వహిస్తోoదని తెలిపారు. ఈ నెల 15వతేదీన విజయవాడలో జరిగే సీపీఎం ప్రజారక్షణ భేరి భారీ బహిరంగ సభకు తరలి రావాలని ప్రజలను కోరారు. స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు సుదీర్ఘకాలంగాసేవా భావంతో  గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని, ప్రభుత్వం మాత్రం చెత్త సేకరణకు ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ రఘు మాట్లాడుతూ బీజేపీ పాలనలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం , లౌకిక తత్వానికి హాని కలుగుతున్నా రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలు మాట్లాడటం లేదని ,విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీకి వంత పాడుతున్నాయన్నారు. జిల్లాలో ఉపాధి సమస్య తీవ్రమైoదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో చల్లపల్లి, హనుమన్ జంక్షన్ షుగరు ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. కొత్తపరిశ్రమలు ఏర్పాటు కావడం లేదన్నారు. అక్వా సాగు, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఉపాధి లేక వ్యవసాయ కార్మికులు వలస పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు నెలల తరబడి జీతాలు అందడం లేదన్నారు. భూ సమస్య పరిష్కరిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం దివి తాలూకాలో 20 వేల ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కరించలేదన్నారు. రైతులు, కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు.  భూ పంపిణీ జరిగి, జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే యువత ,వ్యవసాయ కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే సీపీఎం నాయకులను గతంలో బాబు , ఇప్పడు జగన్ ప్రభుత్వాలు ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎంకు నూటికి 80 శాతంగా ఉన్న పేదలు అండగా నిలవాలన్నారు.   సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం నారాయణ అధ్యక్షతన పామర్రు సెంటర్లో జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వత్తాసు పలుకుతున్న వైసీపీ, టీడీపీ,జనసేనలు రాష్ట్రంలో కుర్చీల ఆట అడుతున్నాయన్నారు. ఈ పార్టీలకు పదవులపై ధ్యాసే తప్ప రాష్ట్ర, ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం సామాన్యులపై పన్ను భారాలు వేస్తూ, విభజన హామీలు  అమలు చేయకపోయినా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ  ప్రయివేటీకరించేందుకు పూనుకున్నా ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్ సి, ఎస్ టి సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తూ సామాజిక సాధికార యాత్రలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.జ్యోతి మాట్లాడుతూ మోడీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మణిపూర్ ఘటనలు ఇందుకు నిదర్శనమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓట్ల కోసమే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో ఈ బిల్లు అమలవ్వదని  2029 నుండీ అమలు చేస్తామని చెప్పడమే బిల్లు ప్రవేశ పెట్టడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదనేందుకు నిదర్శనం అన్నారు. జిల్లాలో మోపిదేవి మండలం కె.కొత్తపాలెంలో గిరిజన మహిళలపై నిందలు మోపి దాడి చేసిన పెత్తందారులు బయటే తిరుగుతున్నారన్నారు. పామర్రు మండలం నిమ్మలూరులో బాలికపై అత్యాచారం ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. డ్వాక్రా గ్రూప్ లకు పావలా వడ్డీ రుణాలు అందడం లేదని, రుణ మాఫి జరగడం లేదన్నారు. పార్టీ ఉయ్యూరు మండల కార్యదర్శి బి. రాజేష్ అధ్యక్షతన ఉయ్యూరు సెంటర్ లో జారిగిన సభలో  సిపిఎం రాష్ట్ర నాయకులు ఎమ్ హరిబాబు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు 50% కలిపి మద్దతు నిర్ణయిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ విధంగా చేయకపోవడం వలన దేశంలో నాలుగు లక్షల మంది రైతులు అందులోనూ 90 శాతం మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు.  మోడీ విధానాలు దేశంలో రైతాంగం వ్యవసాయం చేయడానికి బ్రతకడానికి ఉపయోగపడక పోగా రైతుల ప్రాణాలు తీస్తున్నాయన్నారు. కాబట్టి మోడీ రైతు వ్యతిరేక విధానాలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రoలో గత ప్రభుత్వం రైతాంగానికి ఏమీ చేయలేదు.. నేను రైతుల్ని కాపాడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం కవులు రైతులకు గతంలో ఇచ్చినన్ని గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు ఇవ్వలేదన్నారు.   పక్కనే ఉన్న ఛత్తీస్గడ్ రాష్ట్రం గానీ కేరళ రాష్ట్రం వరి ఉత్పత్తి ఖర్చులకు అదనంగా బోనస్ ఇస్తున్నాయని, ఇక్కడ రైతులకు కనీస మద్దతు ధర అందడం లేదన్నారు. ఈ సభల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాధo, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి వై. నరసింహారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శివనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.

 సమస్యల పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ యూనియన్ నాయకులు

ప్రజాశక్తి. చల్లపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ యూనియన్ నాయకులు ప్రజాదక్షణభేరి రాష్ట్ర సిపిఎం కమిటీ సభ్యులకు  వినతి పత్రాలు అందించారు. రాష్ట్ర సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజారక్షణభేరి స్థానిక ఏటీఎం సెంటర్ వద్ద బహిరంగ సభ శుక్రవారం ఉదయం నిర్వహించారు. సభానంతరం రాష్ట్ర నాయకులు కే లోకనాథం, ఏవి నాగేశ్వరరావు కే ధనలక్ష్మి,ఏం హరిబాబు, కోలాటి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి వై నరసింహారావులకు  ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపి ఆశ వర్కర్స్ యూనియన్ , ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ , కృష్ణాజిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీల సభ్యులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.

auto

 

ashalu