- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పోరాడటం ద్వారానే వారికి న్యాయం జరుగుతుందని పలువురు వక్తలు అన్నారు. విజయవాడ సింగ్‌నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన సిపిఎం ప్రజారక్షణ భేరి బహిరంగ సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాట్లాడారు.
- మహిళలకు న్యాయం మిధ్య : ఎస్.పుణ్యవతి
కేంద్రంలో బిజెపి తీరువల్ల మహిళలకు న్యాయం జరగడం అనేది మిధ్యగా మారిందని, వారి హక్కులను పూర్తిగా హరించి వేస్తున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి అన్నారు. చట్టసభల్లో మహిళలకు హక్కులు కల్పించకుండా ఎన్నికల్లో లబ్ధి కోసం మోసం చేస్తున్నారని అన్నారు. రాజకీయానికి అర్థం ఓట్లు, సీట్లు అని చెప్పే వారికి సిపిఎం భారీ ప్రదర్శన ఒక హెచ్చరిక అన్నారు. ఈ సందర్భంగా 'ఒక్కరోజైనా, ఒక్కనాడైనా కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా' అనే పాటపాడి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. ప్రజలకు అనుకూలంగా ఉండే మీడియాను చూసినా, వామపక్ష భావాలను చూసినా బిజెపికి వెన్నులో వణుకుపుడుతుందుని, న్యూస్ క్లిక్‌పై దాడి అందులో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వస్తే రెండుకోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని మోడీ చెప్పారని ఇద్దరికి కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ రంగ కంపెనీలను నాశనం చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందని అన్నారు. విశాఖ స్టీలును కాపాడుకోవడం కోసం వేయి రోజులుగా కార్మికులు పోరాడుతున్నారని, ఇదే స్ఫూర్తితో సాగితే ప్రైవేటీకరణను అడ్డుకోవచ్చని అన్నారు. దళితులను ఉద్దరిస్తామని రాష్ట్రంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి చెబుతున్నా ఇప్పటికీ అనేక గ్రామాల్లో వారికి శ్మశాసనవాటికలు లేవని పేర్కొన్నారు.
- రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా బతకడం లేదు : ఎం.ఏ.గఫూర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుతో రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా బతకడం లేదని, కష్టాలు, ఇబ్బందులు, ఉపాధి లేమితో కుటుంబాలు గడవడమే ఇబ్బందిగా మారిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్ అన్నారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోని అసమర్థ పాలన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు, పనులు లేక వేలమంది ప్రజలు వలసలు పోతుంటే వారికి ఉపాధి కల్పించాల్సిన సిఎం, వ్యవసాయశాఖ మంత్రి ఇంతవరకు ఉపాధి హామీ పనుల కల్పనపై దృష్టి పెట్టలేదని తెలిపారు. వర్షపాతం ఆధారంగా కరువును నిర్థారించే పనికిమాలిన పాలకులు నేడు రాష్ట్రంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు జీతాలు లేవని, కేంద్రం ఇచ్చిన నిధులనూ స్థానిక సంస్థలకు ఇవ్వకుండా రాష్ట్రం వాడేసుకుందని తెలిపారు. స్కీము కార్మికులకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు ఇస్తామని నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇంతవరకు పెంచలేదని విమర్శించారు. ప్రధాని మోడీ పంచాయతీ కార్మికుల కాళ్లు కడిగారని, ఒక్కరికీ న్యాయం చేయలేదని అన్నారు. ఆప్కాస్ పేరుతో మున్సిపల్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, విఆర్‌ఎలు, విఆర్‌ఒలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఒక్కరికీ న్యాయం జరగలేదని తెలిపారు. జిపిఎస్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌జిఒలకు తీరని ద్రోహం చేసిందని అన్నారు. ఒపిఎస్ స్థానంలో సిపిఎస్ తెచ్చారని, ఇప్పుడు తీసుకొచ్చిన జిపిఎస్ అన్యాయంగా ఉందని పేర్కొన్నారు. హక్కుల కోసం ధర్నాలు, ప్రదర్శనలు, నిరసనలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ఎవరికైనా ఓపికకు ఒక హద్దు ఉంటుందని, కార్మికవర్గం తిరగబడే పరిస్థితిని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. వారి తరపున పోరాడటం కమ్యూనిస్టుల హక్కని అన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు ఇంతవరకు కమిటీ వేయలేదని, ఉన్న చట్టాలనూ కేంద్రం నిర్వీర్యం చేస్తుంటే రాష్ట్రం వంతపాడుతోందని పేర్కొన్నారు. చట్టసభల్లో అధికారం కోసం కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ప్రజల గురించి చర్చలేకుండా పోయిందని పేర్కొన్నారు. కేంద్రం అన్యాయం చేస్తున్నా, అరెస్టు చేయించి జైల్లో పెట్టించినా నోరెత్తని చంద్రబాబు నాయుడు రాష్ట్ర హక్కులను ఏమి కాపాడుతారని ప్రశ్నించారు.
- రాష్ట్రంలో ముదనష్టపు పాలన : పి.మధు
రాష్ట్రంలో ముదనష్టపు పాలన సాగుతోందని, పరిశ్రమలు లేవని, ప్రాజెక్టులు పూర్తిచేయడం లేదని, రాజధాని అంశమే లేకుండా చేస్తున్నారని సిపిఎం సీనియర్ నాయకులు పి.మధు అన్నారు.
బిజెపికి అంటకాగుతున్న వైసిపి, టిడిపి, జనసేన ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరువు ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ఇంతవరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల హక్కులను కాలరాస్తూ అక్కడి భూములను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆగ్రహించారు. ఉపాధి లేదని, దేశంలో ఇప్పటి వరకు ఐదు లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, కార్మికులకు పనిలేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో మోడీని ప్రశ్నించాల్సిన చంద్రబాబు జైలు నుండి విడుదల సమయంలో బిజెపికి అభినందనలు చెబుతున్నారని, ఇదెంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ద్రోహం చేస్తున్న బిజెపిని వెనకేసుకొస్తున్న చంద్రబాబు తీరు సరికాదన్నారు.
- దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని వదిలించాలి : సిహెచ్ బాబురావు
దేశానికి, రాష్ట్రాలకు పట్టిన శని నరేంద్రమోడీ ప్రభుత్వమని, వదిలించు కునేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. రాష్ట్రానికి నరేంద్రమోడీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసినా బిజెపిని ఎదుర్కోకుండా వైసిపి, టిడిపి, జనసేన అంటకాగుతుండటం సరైందికాదని అన్నారు. కేంద్రంపై పోరాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయిందని విమర్శించారు. ప్రజలను చైతన్యం చేసేందుకే సిపిఎం ప్రజారక్షణ భేరిని చేపట్టిందన్నారు. రాష్ట్రానికి పోలవరం, రాజధాని అమరావతి, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ లాంటి హామీలను బిజెపి ప్రభుత్వం విస్మరించినా రాష్ట్రంలో వైసిపి, టిడిపి పోరాటం చేయకుండా మద్దతు తెలుపుతున్నాయని అన్నారు.
- ఉత్తరాంధ్ర వెనుకబాటుకు పాలకులే కారణం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం
ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని రంగాల్లో వెనుకబాటుకు కారణం పాలకులేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లకాలంలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తోటపల్లి, జంజావతి, తారకరామా ప్రాజెక్టుల్లో ఒక్క పైసా ఖర్చు చేయకపోవడం శోచనీయమన్నారు. తీర ప్రాంతాన్ని అంతా అదానీకి కట్టబెట్టి మత్స్యకారులకు, వృత్తిదారులకు ఉపాధిలేకుండా చేశారని విమర్శించారు. పైగా సామాజిక సాధికార యాత్ర పేరుతో ఎస్‌సి, ఎస్‌టిలను పూర్తిగా మోసం చేస్తోందని అన్నారు. వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు దళితులను హత్యచేసి డోర్‌డెలవరీ చేస్తే చర్యలు శూన్యమని అన్నారు. రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు జరిగితే ఒక్క కేసయినా పెట్టారా? అని ప్రశ్నించారు.
- మోడీకి చిత్తశుద్ధి లేదు : డి రమాదేవి
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై, ఎస్‌సి వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోడీకి చిత్తశుద్ధి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి విమర్శించారు. ఈ పదేళ్లకాలంలో ఎస్‌సి వర్గీకరణపై ఏమి చేశారని మొసలి కన్నీరు కార్చారని ప్రశ్నించారు. బిల్కిస్‌బాను కేసులో నిందితులంతా జైలుశిక్ష నుండి ఎలా బయటకు వచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆదివాసులు, దళితులు, వెనుకబడిన తరగతుల పేరుతో రాజకీయాలు చేస్తూ పెత్తందారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవలు చేస్తోందని విమర్శించారు. దళితులపై నిజంగా చిత్తశుద్ధి వుంటే కోనేరు రంగారావు సిఫార్సులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. అందరి మీద దాడులు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. పురందేశ్వరి ఫిర్యాదుపై మద్యం అక్రమాలపై ఎందుకు దాడులు చేయవని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజాపోరాటాలను నిర్మించడమే పరిష్కారమని అన్నారు.
- కరువును పూర్తిగా విస్మరించారు : కె.ప్రభాకర్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం కరువును పూర్తిగా విస్మరించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 350కి పైగా మండలాల్లో వర్షాభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం సరైందికాదన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. రైతులకు సమగ్ర పంటల బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలోని పాడిరైతులకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని విమర్శించారు.
- ఎర్ర సైన్యం కవాతే జవాబు : వి వెంకటేశ్వర్లు
దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని మాట్లాడేవారికి ప్రజా రక్షణభేరీ సందర్భంగా విజయవాడలో ఎర్రసైన్యం నిర్వహించిన కవాతే సరైన సమాధానమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అన్నారు. దేశంలో, రాష్ట్రంలో అధికారంలో లేకున్నా పోరాటాల ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు. 2004లో పార్లమెంట్‌లో 63 మంది కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల ద్వారానే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, గిరిజనులకు అటవీహక్కుల చట్టం, అసంఘటిత రంగకార్మికులకు సమగ్ర చట్టంతో పాటు ఎంతో కీలకమైన ఆహారభద్రతా చట్టాన్ని సాధించామని అన్నారు. పోలవరం కోసం సిపిఎం 20 రోజుల పాటు పాదయాత్ర చేసిందన్నారు. ఎక్కడైనా కష్టజీవులు కన్నీళ్లు తుడిచేది కమ్యూనిస్టులేనని అన్నారు.
- అల్లూరి స్ఫూర్తితో ఉద్యమాలు : కిల్లో సురేంద్ర
రాష్ట్రంలో ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో గిరిజనుల సమస్యలను పరిష్క రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో హక్కుల కోసం ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర విమర్శించారు.
రాష్ట్రంలో 1,500 గిరిజన గ్రామాలు నాన్‌షెడ్యూల్ ప్రాంతంలో వున్నాయని ఆ గ్రామాలను కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్చి ఐటిడిఎ ఫలాలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసులకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో వైఫల్యం చెందిన జగన్ ప్రభుత్వం అదానీ లాంటి వారు అటవీ సంపదను కొల్లగొట్టేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో జాతీయ రహదారులను నిర్మిస్తోందని విమర్శించారు.