Oct 28,2023 14:42

ప్రజాశక్తి-మచిలీపట్నం(కృష్ణాజిల్లా): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా స్పందన సమావేశ మందిరం నందు కృష్ణాజిల్లా పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో సిబ్బందిలో ఉత్సాహనింపడానికి స్వయంగా రక్తదానం చేసిన అడిషనల్ ఎస్పీ(ఏ ఆర్), ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రజల రక్షణకై, ఆసాంఘిక శక్తుల అణచివేతలో ఎందరో పోలీసులు తమ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి అమరులయ్యారు. అలా అమరులైన పోలీస్ వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో గల స్పందన సమావేశ మందిరం నందు నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ పి జాషువా ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్ వైద్యులతో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ భూమి మీద ప్రత్యామ్నాయంగా తయారు చేయలేనివి ఏదైనా ఉన్నదంటే అది మానవ రక్తమేనని, అలాంటి రక్తం సమయానికి అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రత్యామ్నాయం లేని రక్తం దానం చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్న పోలీస్ సిబ్బంది అందరికీ అభినందనలు. మీరు చేస్తున్న రక్తదానం ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతుందని అలాగే ఎంతోమందికి ఆదర్శవంతులని తెలిపారు. అలాగే క్షణం తీరిక లేకుండా నిర్వహించే విధుల కారణంగా ఎంతోమంది పోలీసు అధికారులు ,సిబ్బంది వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన సమయానికి వైద్య పరీక్షలు నిర్వహించుకోకపోవడం వలన అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అలాకాకుండా సంవత్సరంలో రెండుసార్లు పూర్తి వైద్య పరీక్షలు చేయించుకుంటే ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గూర్చి తెలుసుకుంటూ దానికి అనుగుణంగా వైద్య చికిత్సలు తీసుకుంటూ ఉండాలని, మనకి అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకుంటే ఏమీ చేయలేమని, మన ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా పరిరక్షించుకుంటూ ఉంటే జీవితంలో అన్ని సాధించినట్లేనని తెలిపారు.

అనంతరం రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్,  ఇతర పోలీసు అధికారులు ఉత్సాహంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి తమ తోటి పోలీస్ అధికారులకు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. పోలీస్ సిబ్బంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేస్తున్న పోలీసు అధికారులను సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సామాన్య ప్రజలు, విద్యార్థులు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అందులో మరీ ముఖ్యంగా పోలీస్ మహిళా కానిస్టేబుల్ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయడంతో ఎస్పీ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం స్క్వాడ్ టీం సిబ్బందితో మాట్లాడి వారి విధుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. రక్తదానం చేసిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా పండ్ల రసాలు అందజేశారు. అనంతరం ప్రతి ఒక్కరికి రక్తదానం చేసినట్లుగా ప్రశంసాపత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆర్ హరి బాబు, ఏ ఆర్ అడిషనల్ ఎస్పి ఎస్ వి డి ప్రసాద్. బందరు డిఎస్పి వై మాధవ రెడ్డి, ఏ ఆర్ డి ఎస్ పి వెంకటేశ్వరరావు. ఇన్స్పెక్టర్లు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, డాక్టర్ బాలసుబ్రమణ్యం, ఇతర వైద్య సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.