ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా గురువారం చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వు పేరడ్ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి ఇ.భీమరావు, జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, ఐపిఎస్ మరియు జిల్లా అటవీశాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి, ఐ.ఎఫ్.ఎస్. లు స్మృతి పరేడ్ కు హజరై, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా జడ్జి ఇ.భీమరావు మాట్లాడుతూ.... పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. ప్రజాశ్రేయస్సు, శాంతి భద్రతలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులు తమ ప్రాణాలను లోడ్డి విధులు నిర్వహిస్తున్నారని, పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరం అన్నారు. జిల్లాలోని పోలీసులు అండగా ఉంటూ అనేక రకాలుగా వారిని ఆదుకుంటామన్నారు. పోలీసులు పడుతున్న కష్టాన్ని శ్రమను గుర్తిస్తే వారికి అదే సంతోషం ఇస్తుందన్నారు. విద్యార్థులు, సమాజంలో ఉన్న ప్రజలు క్రమశిక్షణతో మెలిగేందుకు అవగాహన సదస్సులు కల్పించాలని జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీలను కోరుతున్నామన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యతన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం అన్నారు. శాంతి భద్రతల కట్టడిలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తున్న పోలీసులను సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, ఐపిఎస్ మాట్లాడుతూ.... దేశం కోసం ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామన్నారు. సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసం, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఆగష్టు నెలలో పుంగనూరులో అల్లరి మూకల దాడిలో చిత్తూరు పోలీసులు 50 మంది వరకు గాయాలపాలైనారు, ఒక కానిస్టేబుల్ తన కంటి చూపును సైతం పోగొట్టుకున్నారు. అల్లరి ముష్కరులు ఇంతటి విధ్వంసం చేసిన పోలీసు వారు తమ మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రజల శాంతికి భంగం వాటిల్లకుండ లా అండ్ ఆర్డర్ ను కాపాడుటలో తమదైన నేర్పును ప్రదర్శించారు. అమరులైన అందరి కోసం శ్రధ్దాంజలి ఘటిస్తూ, నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీసు కుటుంబాల వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
జిల్లా అటవీశాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి, ఐ.ఎఫ్.ఎస్. మాట్లాడుతూ... 1959 అక్టోబర్ 21న జరిగిన దురదృష్ట సంఘటన ను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను సంస్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా ఈ రోజున పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. కరోన లాంటి ప్రమాదకరమైన వైరస్ ప్రపంచం అంతటా వ్యాప్తి చెందినప్పుడు అందరు ఇళ్ళకు పరిమితమైన కూడా ఒక్క పోలీసు మాత్రమే వారి విధి నిర్వహించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్.సుధాకర్, అడిషనల్ ఎస్పీ ఎస్.ఇ.బి. శ్రీలక్ష్మీ, అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. శ్రీ జి.నాగేశ్వరరావు, చిత్తూరు SDPO కె.శ్రీనివాస మూర్తి, నగరి SDPO కె.రవి కుమార్, SB డిఎస్పి వి.శ్రీనివాసులు రెడ్డి, మహిళా డిఎస్పి జె.బాబు ప్రసాద్, డి.టి.సి. డి.ఎస్పీ డి.శ్రావణ్ కుమార్, ట్రాఫిక్ ఇంచార్జ్ డి.ఎస్పీ విష్ణు రఘువీర్, ఏఆర్ డిఎస్పి మురళీధర్, పట్టణంలోని అందరు సి.ఐ లు, ఆర్.ఐ. లు, ఎస్సై లు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు ఉదయ్ కుమార్, పోలీస్ ఆఫీస్ సిబ్బంది మరియు పోలీసు కుటుంబాలు పాల్గొన్నారు.










