Mar 19,2023 16:17

చిట్టు పాడే
ఆకుపచ్చని పాటని
లే లేత నీడలోంచి
నిదుర లేచిన
పిల్ల తెమ్మెర పిట్ట
ఊరంతా పంచి పెట్టింది.
ఆహా! ఎంత పరవశం.
మనసెంత పరిమళం.
గాలికేం పనుంది?
ఎప్పుడూ మధురమైన
బాణీలు కట్టి
ఇల్లిల్లూ తిరిగి
హార్మోనియం మెట్లక్కి
నదుల్ని గదుల్లోకి
తీసుకురావటమే కదా!
ఈ పక్షి సమీరం
ఎంత సంగీత సాధన చేసి
సమ్రాట్టు అయిందో...
ఈ పాటను పట్టుకునే
తూనీగలు.. సీతాకోకలు
మిణుగురులు
చెట్లతో జతకట్టి
లోకాన్నంతా
పలకరించడానికి
బయల్దేరాయి.
గాలికి వీటికీ పోటీ.
దేని అందం దానిదే.
దేని సంగీతం దానిదే.
ఎంతెంత ప్రవాహం.
ఎన్నెన్ని పరిమళాలు.
ఏమేమి జ్ఞాపకాలు.
ఎంత ప్రశాంతత.
ప్రకృతి గొప్ప
కాస్ట్యూమ్‌ డిజైనర్‌.
మిస్‌ ఋతు ఈ ఏటికి
కొత్త దుస్తులు తొడిగింది.
వగరు చిగురుమేసిన
గ్రేట్‌ సింగర్‌
కోకిల వసంత
మరో కొత్త పాటని
ట్యూన్‌ చేసి
ఈ లోకాన్ని
సరికొత్తగా ఆలపిస్తూ
అభినందనలు పలికింది.
ఇంటింటికి
పండుగను తెచ్చింది.
ఎన్నో ఆనందాలు పంచింది..
కాలం నడుము వాల్చదు.
అలలకు కలలు ఉండవు.
ఎందుకంటే అవి నిద్రపోవు.
పగటి కలలు అసలే కనవు.
అవిశ్రాంత పోరాటమే దాని కల.
పాత దానిని వదిలి
నిత్య నూతనంగా
చిగురులెత్తటమే
చీకటి తెరలను చీల్చుకుని
వెలుగు తారగా
ప్రకాశించటమే
ఆకుపచ్చని
ఋతు సంగీతం.


- శిఖా - ఆకాష్‌
9381522247