Mar 19,2023 15:52

నీతి వాక్యాలు వల్లించిన
తొలి భాష ఏది?
తమిళమా? చైనీసా?
లాటినా? గ్రీకా?
కాదు ... అవేవీ కావు!

ప్రకృతి
తన నుదుటి మీద..కనుబొమల మీద
కళ్లల్లో ..బుగ్గల్లో
ఛాతీ మీద .. బాహుమూలాలలో
రాసి ఉంచిన నీతినే
తన భాషలోకి అనువదించాడు మనిషి!

పైకే ఎగబాకుతూ మండుతోంది జ్వాల -
పైకి మొలకెత్తుతుంది విత్తనం -
పైపైకి ఎగసిపోతుంది మబ్బు -
పైకే పెరుగుతాడు మనిషి -
అంతా పైపైకే

కాని కిందికి పడుతుంది
అది కిందికి కురియకపోతే -
మరి పైకి పెరిగేది
ఈ భూమిలో ఏది?

వాన అన్నది:
'కరుణ కలిగినవాడే
ప్రాణులన్నిటికీ
నాయకుడిగా ఉంటాడు'

తీరం మేలుకుని ఉందా?
నిద్ర పోతోందా?
తెలీదు.

మాతృభాష రాని మనుషులకి
తమ పాట అర్థం అవుతుందా? అవదా?
తెలీదు.

కానీ గులకరాళ్ళని
నోట్లో వేసుకుని నది పాడుతూనే ప్రవహిస్తుంది

నది కూడా ఒక గీతా వాక్యం చెప్పింది:
'కర్తవ్యాన్ని నిర్వహించు
ఫలితం కోసం ఎదురు చూడకు!'

ఎక్కే వాళ్ళందరినీ
వంగి రమ్మని చెబుతుంది
దిగే వాళ్ళందరినీ
నిటారుగా నడిపిస్తుంది

కొండ అంది:
'వినయంగా బతికితే
పైకి వెళ్తావు
విర్రవీగుతూ బతికితే
కిందికి దిగిపోతావు'

వేర్లని తెంపేస్తూ పారే
నది మీద కూడా
గలగలా పూవులని రాల్చే
ఒడ్డునున్న కొమ్మలు..

తెంపినందుకు కోపం లేదట
తడిపినందుకు కృతజ్ఞత అట

చెట్టు అంది:
'ఎవరేం' చేసినా
మంచే చెయ్యి'

చిరునామా లేకుండానే భూమి మీదకి వస్తుంది
ఎక్కడ ఆల్చిప్ప మేలుకుని ఉంటుందో
అక్కడ పడి ముత్యంగా మారుతుంది

వాన చినుకు అన్నది:
'ముత్యం తాలూకు విత్తు
ఎప్పుడైనా పడొచ్చు
మేలుకొని ఉండు, ఓ మనిషీ మేలుకుని ఉండు'
బబబ
కింద బురద
పైన నాచు
తన చుట్టూ కప్పల సంగీతం
అయినా
నీళ్ళల్లో జ్వాలలు పూసినట్టున్న
తామరపూలకే
ఎంత సౌందర్య గంభీరం

తామర పువ్వు అన్నది:
'పరిసరాల వాళ్ళ ఘనత పొందుట' సులభం
పరిసరాలకు ఘనత చేకూర్చటమే గొప్ప!'
**********

అస్తమయం అన్నారు
గుడ్లగూబలకి సంతోషమయింది
నక్షత్రాలు ఆనందంతో నాట్యం చేసాయి
'తను మరణించలేదన్న సంగతి
చంద్రుడికి వెలుగునిచ్చి
నిరూపించాడు సూర్యుడు!'

సూర్యుడు అన్నాడు:
'మరణించాక కూడా జీవించి ఉండాలంటే
నీ పాదముద్రలు వదిలి వెళ్లు!'
**********


అగ్ని పర్వతం పేలింది
యాభై కిలోమీటర్లు పారింది
'అగ్ని ప్రవాహం
అక్కడి వాళ్ళెవరూ
ఇళ్ళు వదిలి పోలేదు!'

అగ్ని ప్రవాహం ఆరి బూడిదయ్యాక
మిత్రులు నాటగా
ఆరింతలు అద్భుతమైన పంటలు

అగ్నిపర్వతం అన్నది:
'ఏ ఒక్క చెడులోనైనా
ఇంకొక మంచి ఉంటుంది!'


తమిళ మూలం: వైరముత్తు
(సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత)
తెలుగు అనువాదం: ఆర్‌. శాంతసుందరి
(సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత)