Nov 12,2022 22:20
  • రాష్ట్ర ప్రయోజనాలే మా అజెండా

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంతోనూ, ప్రధాని మోడీతోనూ తమది రాజకీయాలకు, పార్టీలకు అతీతమైన అనుబంధమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రధాని ప్రసంగానికి ముందు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్య చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ అజెండా అని ఆయన చెప్పారు. 'రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా మాకులేదు. ఉండదు. ఉండబోదు' అని అన్నారు. సమైక్య రాష్ట్ర విభజన గురించి ప్రస్తావిస్తూ 'ఎనిమిదేళ్ల క్రితం విభజన సందర్భంగా అయిన అతి పెద్ద గాయం నుండి రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. ఈ గాయం నుండి కోలుకోని జాతీయ స్రవంతితో సమానంగా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రతి ప్రత్యేక సాయం, ఏర్పాటు చేసే ప్రతి సంస్థ, అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్‌ నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుంది.' అని సిఎం అన్నారు. రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను ప్రజలు ఏ విధంగా గుర్తుంచుకున్నారో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేసే సాయం, అభివృద్ధి పనులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. 'గడిచిన మూడన్నరేళ్ళలో పిల్లల చదువులు, ప్రజల వైద్యం ఆరోగ్యం, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు ప్రాధాన్యత నిచ్చి పారదర్శకంగా అడుగులు వేశాం. రాష్ట్రం నిలదిక్కుకోవడమంటే ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి, ప్రతి ఇంటా ఆత్మవిశ్వాసం నింపడానికి మా ఆర్థికవనరుల్లో ప్రతి రూపాయిని సద్వినియోగం చేశాం. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తి మేరకు మేం చేస్తున్న ప్రయత్నాలకు మీరు, మీ సహాయ సహకారాలను మరింతగా అందించాలి.' అని కోరారు.

  • విజ్ఞప్తులను పరిష్కరించండి

రాష్ట్ర ప్రజలందరి తరపున. రాష్ట్ర అభివృధ్ధి దృష్ట్యా చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని ప్రధానికి సిఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. 'విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుండి ప్రత్యేకహోదా వరకు, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు దగ్గర నుండి రైల్వే జోన్‌ వరకు పలు అంశాల మీద, పలు సందర్భాల్లో మీకు చేసిన విజ్ఞప్తులను మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని, వాటిని పరిష్కరించాలని కోరుతున్నా' అని సిఎం అన్నారు. సిఎం తన ప్రసంగంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవుల కవితలు, పాటలు గుర్తు చేశారు. వంగపండు, శ్రీశ్రీ, గురజాడల రచనలను ప్రస్తావించారు.