* శ్రీలంక ఆర్థిక శాఖ వద్ద కీలక పత్రం
* ఆత్మరక్షణలో ఇరు దేశాల ప్రభుత్వాలు
న్యూఢిల్లీ : పొరుగు దేశం శ్రీలంకలోని ఒక పవన విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు కట్టబెట్టే విషయం ఇప్పుడు రెండు దేశాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ విషయంలో శ్రీలంక అధ్యక్షుడిపై మోడీ ఒత్తిడి చేశారంటూ కొన్ని రోజుల క్రితం ఆ దేశ విద్యుత్ బోర్డు చీఫ్ ఆరోపణలు వినిపించి బాంబు పేల్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో శ్రీలంక పార్లమెంటు కమిటీ ముందు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మెన్ ఎంఎంసీ ఫెర్డినాండో ఈనెల 10న తన వాంగ్మూలాన్ని సైతం ఇచ్చారు. అనంతరం తన ఆరోపణలను సిఇబి చీఫ్ వెనక్కి తీసుకోవటం.. గొటబాయ సైతం ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చటం జరిగాయి. అయితే, సిఇబి చీఫ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలు కావనీ.. తన వాంగ్మూలంలో చేసిన ఆరోపణలు వాస్తవాలేనని రుజువు చేసే కీలక పత్రాలు శ్రీలంక ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఈ పత్రంలోని విషయాలు బహిర్గతం కావటంతో ఇటు మోడీ సర్కారు, అటు శ్రీలంక ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయాయి.
ఆర్థిక శాఖ పత్రంలో ఏమున్నది?
ఫెర్డినాండో ఈ అధికారిక లేఖను శ్రీలంక ఆర్థిక శాఖకు గతేడాది నవంబర్ 25న రాశారు. 'శ్రీలంకలోని అదానీ గ్రూపు ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం మద్దతున్నది. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రతిపాదనను భారత ప్రభుత్వ నుంచి వచ్చిన ప్రతిపాదనగా పరిగణించాలని ప్రధాని (శ్రీలంక) నన్ను ఆదేశించారు. ఇది ప్రభుత్వ ప్రతిపాదన (గవర్నమెంట్ టు గవర్నమెంట్) ప్రతిపాదనగా చూడాలి' అని సిఇబి చైర్మెన్ పేర్కొన్నట్టు అందులో ఉన్నది. దేశంలోని ఎఫ్‌డీఐ సంక్షోభాన్ని తట్టుకునే చర్యలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు ఈ ఒప్పందంలో ఉన్నట్టు దీనిని పరిగణించాలని వివరించారు. అదానీ ఒప్పందానికి గ్రీన్ సిగల్ ఇవ్వటానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేపై మోడీ ఎలా ఒత్తిడి పెట్టారన్న దాని గురించి కూడా ఆయన అందులో వివరించారు. అదానీ గ్రూపునకు 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టాలంటూ శ్రీలంక అధ్యక్షుడు తనను ఆదేశించినట్టు పేర్కొన్నారు. అయితే, ఈ లేఖ ప్రకారం అదానీ ప్రతిపాదనను భారత ప్రభుత్వ ప్రతిపాదనగా శ్రీలంక ప్రధాని (మహేంద్ర రాజపక్సే) పిలవటంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.