న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ సోమవారం ఆయనకు నివాళులర్పించారు. గాంధీ ఐకమత్యం, కరుణ వంటి వంటి గుణాలను ప్రపంచమంతా వ్యాప్తి చేసేలా మానవాళిని ప్రేరేపించారని అన్నారు. ''గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నమస్కరిస్తున్నా. ఆయన బోధనలు మన మార్గాన్ని ఎల్లప్పుడూ ప్రకాశింపజేస్తూనే ఉంటాయి. యావత్ ప్రపంచంపై ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన కలలను సాకారం చేసేందుకు మనం కృషి చేద్దాం. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ మన మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని పెంచుకుందాం'' అని అన్నారు.
భారత దేశ రెండవ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనను కూడా ప్రధాని స్మరించుకున్నారు. ''ఆయన సరళత, జాతిపట్ల అంకిత భావం, ' జై జవాన్, జై కిసాన్' పిలుపు నేటికి ప్రతిధ్వనిస్తోందని, భావితరాలకు స్ఫూర్తిదాయకం'' అని అన్నారు. భారతదేశ పురోగతి పట్ల ఆయన నిబద్ధత మరియు సవాళ్లు ఎదురైన సమయంలో ఆయన నాయకత్వం ఆదర్శప్రాయమని ప్రశంసించారు. భారతదేశం కోసం ఆయన దార్శనికతను సాకారం చేసుకునేందుకు మనం ఎల్లప్పుడూ కృషి చేద్దామని అన్నారు.