- ఆహ్వానించిన మోడీ
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించారు. అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. అయితే ఆ సమయంలో అమెరికన్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయని, అందుకే ఆ ఆహ్వానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. క్వాడ్ సదస్సు కోసం వచ్చే ఏడాది బైడెన్ భారత్‌లో పర్యటించాల్సి వుంది. అదే సమయంలో ఇండో-పసిఫిక్ క్వాడ్రిలేటరల్ గ్రూపు సమావేశం జరిగేలా చూసేందుకు జపాన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలతో కూడా మాట్లాడాలని భారత్ ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు తెలిపాయి.
జి-20సదస్సుకు ముందుగా మోడీ, బైడెన్‌ల ద్వైపాక్షిక సమావేశం జరిగిన సమయంలోనే, ప్రధాని మోడీ ఈ ఆహ్వానాన్ని అందచేశారని గార్సెటి తెలిపారు. అయితే ఆ సమయంలో క్వాడ్ సదస్సు గురించి ఆయన ప్రస్తావించలేదని అన్నారు. రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవాలకు రావాల్సిందిగా బైడెన్‌ను మోడీ ఆహ్వానించడం ఇది మూడవసారి. ప్రతి ఏటా ఈ ఆహ్వానం వేర్వేరు దేశాలకు వెళుతుంది. 2015లో మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా విచ్చేశారు. 2018లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఆనాటి ఆహ్వానాన్ని తిరస్కరించారు. తాజాగా ఇప్పుడు బైడెన్‌ను ఆహ్వానించారు. అది పరిశీలనలో వుంది.