న్యూఢిల్లీ : ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 (ఐఎంసి) 7వ ఎడిషన్‌ను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 2014 కేవలం తేదీ మాత్రమే కాదని, అదో మార్పు అని అన్నారు. ఆ మార్పు కోసం ప్రజలు 'అవుట్‌డేటెడ్ ఫోన్' లాంటి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎని విడిచిపెట్టి, దేశ గతిని మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని అన్నారు.
కాలం చెల్లిన ఫోన్లలో ఆగిపోయిన స్రీన్లను ఎన్నిసార్లు స్వైప్ చేసినా, ఎన్ని బటన్లు నొక్కినా ఫలితం ఉండదని అన్నారు. రీస్టార్ట్ చేసినా, బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టినా, చివరకు బ్యాటరీ మార్చినా ఆ ఫోన్లు పనిచేయవని, గత ప్రభుత్వం ఆ స్థితిలోనే ఉండేదని అన్నారు. మొబైల్ ఫోన్‌లను దిగుమతి చేసుకోవడం నుండి ఎగుమతిదారుగా భారత్ అభివృద్ధి చెందిందని అన్నారు. ఆపిల్ నుండి గూగుల్ వరకు, అతిపెద్ద టెక్ కంపెనీలు దేశంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చాయని పేర్కొంటూ ఈ సందర్భంగా కొన్ని గణాంకాలను విడుదల చేశారు.
వేగవంతమైన 5జి నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిందని, ఇప్పుడు 6జి దిశగా భారత్ అడుగులు వేస్తోందని అన్నారు. ఇప్పుడు ప్రపంచం 'మేడ్ ఇన్ ఇండియా' ఫోన్‌లను వినియోగిస్తోందని అన్నారు. 5జి అందుబాటులోకి వచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జి బేస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని అన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంక్‌లో ఉండగా.. ఇప్పుడు 43వ ర్యాంక్‌కు చేరిందని అన్నారు. భారత్ టెలికాం టెక్నాలజీ డెవలపర్‌గా, ఎగుమతిదారుగా అభివృద్ధి చెందుతోందని కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.