
ప్రతిపక్షాలపై విసుర్లు
న్యూఢిల్లీ : 'అమృత్ భారత్ పథకం' పేరుతో దేశంలోని 508 రైల్వేస్టేషన్ల మెరుగుదల పనులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు. శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ, తాము పనిచేయం, పనిచేసే వారిని అడ్డుకుంటామన్నట్లుగా ప్రతిపక్షాల్లో ఓ సెక్షన్ పనిచేస్తోందని రుసరుసలాడారు. అధునాతనంగా తీర్చిదిద్దిన పార్లమెంట్ భవనాన్ని కూడా కొన్ని పార్టీలు తప్పుపట్టాయన్నారు. ప్రతికూల రాజకీయాలను అధిగమిస్తూ అభివృద్ధి ప్రాధాన్య మార్గంలో ముందుకెళ్తున్నామని చెప్పారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 508 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈశాన్య భారతదేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులు రైల్వే నెట్‌వర్క్‌తో త్వరలో అనుసంధానం కానున్నాయని తెలిపారు. స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త డిజైన్లను రూపొందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.24,470 కోట్లుగా వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో 39 రైల్వే స్టేషన్లను తొలి దశలో అభివృద్ధి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.453.50 కోట్లతో 18 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. రాష్ట్రంలో అభివృద్ధి చేసే స్టేషన్లలో పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల, కర్నూలు, కాకినాడ టౌన్, ఏలూరు, తుని, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ ఉన్నాయి.