కమ్యూనిస్టులు ప్రజలలో పని చేయడం, సామ్రాజ్యవాద వ్యతిరేక విధానానికి గట్టిగా కట్టుబడి ఉండడం, ఆఖరికి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగస్వాములైన వారిని కూడా ఆకర్షించింది. అరుణా అసఫ్‌అలీ వంటి నాయకులు పార్టీలో చేరారు. తమ అవగాహనలో లోపం ఉన్నప్పటికీ పార్టీ బ్రిటిష్ నాయకులతో చేతులు కలపలేదు. 1942 సెప్టెంబర్ 2న, 1943 సెప్టెంబర్ 20న హోం విభాగం, లండన్ రాష్ట్ర కార్యదర్శికి పంపిన నివేదికలు కమ్యూనిస్టుల త్యాగాలను తక్కువ చేసే వారికి తిరుగులేని సమాధానం. 1939లో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధానికి మద్దతునివ్వడానికి కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకం. యుద్ధాన్ని వ్యతిరేకించాలని భారతదేశ ప్రజలకు పిలుపునిచ్చింది. యుద్ధం వలన ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక దుష్పరిణామాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలకు తీవ్ర నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా నాయకత్వం వహించింది.
1941లో హిట్లర్ సోవియట్ యూనియన్‌పై దాడి చేశాక యుద్ధం స్వరూపం పూర్తిగా మారిపోయింది. సోషలిజం కంచుకోట అయిన రష్యాపై ఫాసిస్టు శక్తులు దాడి చేశాయి. యుద్ధం ప్రపంచ వ్యాప్త యుద్ధంగా, ఫాసిజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జర్మనీ, ఇటలీ, జపాన్‌లకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంగా మారిపోయింది. ఈ మార్పును నాటి కమ్యూనిస్టుపార్టీ గుర్తించలేదు. 1941 వరకు సామ్రాజ్యవాద యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. యుద్ధాన్ని విప్లవ యుద్ధంగా మరల్చమని పొలిట్‌బ్యూరో నిర్దేశం చేసింది. దిఒలి నిర్బంధ క్యాంప్‌లో ఉన్న కమ్యూనిస్టులు యుద్ధంపై పార్టీ వైఖరి ఏంటని ప్రశ్నించారు. యుద్ధం అంచనాను, ఎత్తుగడలను పార్టీ మార్చుకోవాలని బిటి రణదీవే నాయకత్వంలోని గ్రూపు ఒక పత్రాన్ని రాసింది. దీన్ని 'జైలు పత్రం'గా పిలుస్తున్నారు. ఆ ప్రకటనలో 'మనుగడలో ఉన్న ఒకే ఒక్క కార్మికవర్గ రాజ్యంపై మారణహోమం చేయడం వలన నాజీయిజం తనను తాను అంతర్జాతీయ కార్మికవర్గ ప్రధాన శత్రువుగా మార్చుకుంది. అందుచేత భారతదేశంలో కార్మికవర్గ పార్టీ కచ్చితంగా యుద్ధంలో జోక్యం చేసుకొని యుద్ధం ప్రజాయుద్ధం అని ప్రకటించాలి. యుద్ధంలో గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డాలి'. గ్రేట్ బ్రిటన్ కమ్యూనిస్టుపార్టీ కూడా యుద్ధం స్వరూపం మారిందని ప్రకటన పంపింది. ఆ ప్రకటనల ఆధారంగా 1941లో పార్టీ పొలిట్‌బ్యూరో ఒక తీర్మానం చేసింది. యుద్ధం మౌలిక స్వరూపం మారిందని అంగీకరించింది. ఫాసిజంపై ప్రజాయుద్ధం గెలుపు భారతదేశంలో స్వాతంత్య్రం కోసం చేస్తున్న పోరాటానికి సహాయపడుతుందని భావించింది.

1940 అక్టోబర్‌లో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహానికి దిగారు. ఏడాది పాటు సత్యాగ్రహం సాగాక భారతదేశ నాయకులతో సంప్రదింపులకు యుద్ధ కాలంలో కేబినెట్ సభ్యుడిగా ఉన్న సర్ స్టాఫోర్డ్ క్రీవ్స్‌ని బ్రిటిష్ సర్కారు పంపింది. స్వాతంత్య్రానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలూ లేకపోవడంతో రాయబారం విఫలమైంది. పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అప్పుడే ప్రభుత్వం దిగొచ్చి కాంగ్రెస్‌తో సెటిల్మెంట్‌కు వస్తుందని గాంధీ నిర్ణయానికొచ్చారు. కాంగ్రెస్‌లోని ఒక భాగం పోరాట సమయం ఇది కాదని భావిస్తున్నా, కాంగ్రెస్ నాయకత్వాన్ని గాంధీ ఒప్పించే యత్నం చేశారు. 1942 ఆగస్టు 9 నుండి దేశ వ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించాలని ఆగస్టు 8న ముంబయి నుండి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. గాంధీ ఊహకు భిన్నంగా బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ బంధించింది. నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారాయి. బ్రిటిష్ దమనకాండకు ఎంతో మంది గాయపడ్డారు.
కమ్యూనిస్టుపార్టీ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా మరల్చేందుకు ఒక వైపు పిలుపునిస్తూనే మరో వైపు ఖైదు చేసిన కాంగ్రెస్ నాయకులందరినీ విడుదల చేయాలని, కాంగ్రెస్- లీగ్ జాతీయ స్థాయిలో ఐక్యం కావాలని, జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో బర్మాను ఆక్రమించేందుకు జపనీయులు భారత సరిహద్దులో సిద్ధంగా ఉండగా, యుద్ధ ప్రయత్నాలు విచ్ఛిన్నం కాకూడదని అన్ని రకాల పోరాటాలను వ్యతిరేకించింది. అయితే స్వాతంత్ర పోరాటం చేస్తున్నవారిపై దమనకాండను ఖండించింది.
స్వాతంత్య్రం వచ్చాక ఆ నాటి నిర్ణయాన్ని పార్టీ పున్ణసమీక్షించుకుంది. ఈ విధంగా ప్రకటించింది. 'ప్రజా యుద్ధని ప్రకటించడం సరైనదే అయినా పార్టీ తీవ్రమైన తప్పు చేసింది. అంతర్జాతీయ వైరుధ్యాలతో జాతీయ వైరుధ్యాలను జోడించడంలో విఫలమైంది. జాతీయ స్థాయిలో ప్రజలకు, బ్రిటిష్ వారికీ ఉన్న వైరుధ్యం ప్రబలమైనది. అందువలన క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించడం, యుద్ధ ప్రయత్నాలకు అడ్డని ప్రజా పోరాటాల్లో పాల్గొనకపోవడం పార్టీ చేసిన తప్పు'.
1945లో యుద్ధం ముగిశాక ఎన్నో ప్రజా పోరాటాలకు పార్టీ నాయకత్వం వహించింది. ఈ కాలంలో సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ పార్టీగా, జాతీయ స్థాయిలో ఒంటరిపాటుకు గురైనప్పటికీ యుద్ధం కారణంగా ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యలపై పని చేసి వారికి సహకారం అందించింది. కొత్త తరగతుల్లోకి, కొత్త ప్రాంతాల్లోకి ప్రవేశించగలిగింది.
1942 సెప్టెంబర్ 2న హోం విభాగం, లండన్ రాష్ట్ర సెక్రటరీకి రాసిన ఉత్తరంలో ఈ విధంగా రిపోర్ట్ చేసింది. 'భారత కమ్యూనిస్టుపార్టీ సభ్యులలో అనేక మంది ప్రవర్తనను గమనిస్తే, వారు బ్రిటిష్ వ్యతిరేక విప్లవ కారులుగా అనిపిస్తున్నారు'. 1943 సెప్టెంబర్ 20న ఇచ్చిన మరో నివేదికలో 'అది (భారత కమ్యూనిస్టు పార్టీ) అంతర్జాతీయత గురించి మాటమాత్రంగా మాట్లాడుతున్నా, భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఒక జాతీయ పార్టీ. అందులోకి అధిక సంఖ్యలో సభ్యులు చేరడానికి కారణం అది నిరంతరంగా బ్రిటిష్ పాలనను అంతం చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉండటమే'.










