Sep 13,2022 16:21

శ్రీనగర్‌ :   ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించేంత వరకు, అన్యాయానికి ముగింపు పలికేంతవరకు తమ పార్టీ పోరాడుతుందని పిడిపి అధినేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ సాధ్యంకాదని, అసత్యపు వాగ్దానాలతో జమ్ముకాశ్మీర్‌ ప్రజలను కొన్ని పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయంటూ ఆదివారం ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో నిర్వహించిన ర్యాలీలో గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ... అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. బ్రిటీష్‌ అణచివేతను కాంగ్రెస్‌ ఎలా అంతం చేసిందో... అదేవిధంగా జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 పునరుద్ధరించడం సాధ్యం కాదని విశ్వసించేవారు ఉన్నారని, సమస్య పరిష్కరించబడుతుందని విశ్వసిస్తున్న గొంతుకలు ఉన్నాయని అన్నారు. ఆజాద్‌ భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని, బిజెపి కూడా భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చని... దానికి తాము ఏం చేయలేమని అన్నారు. తాము కూడా ధృడమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నామని, జెకెలో అన్యాయానికి ముగింపు పలికి తీరతామని ముఫ్తీ స్పష్టం చేశారు.