
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు సవాలు చేస్తూ వాదనలు వినిపించిన జమ్ముకాశ్మీర్ లెక్చరర్ జహూర్ అహ్మద్ భట్ సస్పెండ్ చేయడాన్ని పరిశీలించాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. కోర్టుకు హాజరైన వారిని సస్పెండ్ చేస్తారా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ అటార్నీ జనరల్ వెంటకరమణిని ప్రశ్నించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడాలని, సస్పెండ్ విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు. భట్ కోర్టుకు హాజరు కావడానికి మరియు సస్పెన్షన్ ఉత్తర్వుల సామీప్యతపై జస్టిస్ బి.ఆర్. గవై కేంద్రాన్ని ప్రశ్నించారు. సస్పెన్షన్‌కు దారితీసిన ఇతర సమస్యలు ఉన్నాయని కేంద్రం, జమ్ముకాశ్మీర్ యంత్రాంగం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
భట్ కోర్టుకు హాజరయ్యారని, పిటిషన్‌లను సమర్పించిన మరుసటి రోజు అతనిని సస్పెండ్ చేశారని భట్ తరపు న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్‌ధావన్‌లు కోర్టుకు తెలిపారు. ఇది ఏమాత్రం సరికాదని, ప్రజాస్వామ్యంలో పనిచేయాల్సిన పద్ధతి ఇది కాదని అన్నారు. ఒకవేళ ఇతర సమస్యలు ఉంటే ఆయనపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని, కోర్టుకు హాజరయ్యేంత వరకు ఎందుకు వేచి వుండాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
ఆర్టికల్ 370 రద్దుని సవాలు చేస్తూ న్యాయశాస్త్రంలో పట్టా పొందిన జహూర్ అహ్మద్ భట్ ఈ నెల 23న సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. ఆ మరుసటి రోజు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు జమ్ముకాశ్మీర్ పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి నోటీసులిచ్చారు. సస్పెన్షన్ సమయంలో ఆయన జమ్ముడైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో అటాచ్ చేసింది. దీంతో ఆయన సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.