
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370పై విచారణ సందర్భంగా గురువారం సుప్రీంకోర్టులో కేంద్రంపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విరుచుకుపడ్డారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ.. జమ్ముకాశ్మీర్‌లో శాంతిభద్రతలు మెరుగయ్యాయని, 2018లో 52 సంఘటిత బంద్‌లు జరగగా, నేడు బంద్ ప్రస్తావనే లేదని అన్నారు. ఈ వాదనను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీవ్రంగా వ్యతిరేకించారు. సెక్షన్ 144 పేరుతో 5000మందిపై గృహ నిర్బంధం విధిస్తే.. బంద్ లేదా ధర్నాలు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయవద్దని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ''5000 మంది గృహనిర్బంధంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 144 విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిషేధించి... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వాటన్నింటినీ కోర్టు గుర్తిస్తుంది'' అని అన్నారు.
ప్రజలు ఆస్పత్రికి వెళ్లేందుకు కూడా అవకాశం లేనపుడు బంద్‌లు, ధర్నాలు ఎలా జరగుతాయని ప్రశ్నించారు. ఇంటర్నెట్‌పై నిషేధం విధించినట్లు సుప్రీంకోర్టు కూడా తీర్పులో ఆమోదించిందని, కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌పై నిషేధం లేదని ఎలా చెబుతున్నారు'' అని ప్రశ్నించారు. విచారణ ప్రత్యక్ష ప్రసారమవుతున్నందున అన్నీ రికార్డవుతున్నాయని, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అందరికీ తెలుస్తాయని అన్నారు.
జమ్ముకాశ్మీర్‌లో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ఆ అంశం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల చేతుల్లో ఉందని అన్నారు. జమ్ముకాశ్మీర్‌కి రాష్ట్రహోదా కల్పిస్తామని.. అయితే కచ్చితమైన సమయం గురించి ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు.
కాగా, ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై గత 13 రోజులుగా సుప్రీంకోర్టు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.