సురేష్ అనే విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పై చదువులకు వెళ్లలేకపోయాడు. ఊర్లోనే ఉంటూ కూలీనాలీ పనులు చేసుకుంటూ కుటుంబా నికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కానీ, కొద్దిపాటి ఆదాయంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. దీంతో, ఉపాధి నిమిత్తం సమీప పట్టణానికి వెళ్లాడు. చాలా షాపులు తిరిగినా ఎక్కడా పని దొరకలేదు. సురేష్ నిరాశ చెందాడు.
సాయంత్రం అయ్యింది. ఖాళీగా ఉన్న ఒక బట్టల షాపు వద్దకు వెళ్లాడు. ''మాది చాలా పేద కుటుంబం. నాకు పని ఇప్పించండి.'' అని కోరాడు. ఆ షాపు యజమాని సురేష్ వైపు చూస్తూ ''నాకే పనీ పాటా లేక ఖాళీగా కూర్చున్నాను. పొద్దున్నుంచి అద్ద రూపాయి గిరాకీ లేదు. ఇక నీకెలా పని ఇచ్చేది?' అంటూ విసుక్కున్నాడు.
''అయ్యా... నాకు పని లేకపోతే ఇంట్లో అమ్మానాన్న పస్తులుంటారు'' అంటూ సురేష్ నిట్టూర్చాడు. షాపు యజమానికి సురేష్ పరిస్థితి అర్థమైంది. తన గుమాస్తాతో భోజనం తెప్పించి, తినమన్నాడు. కుర్రోడు మంచివాడే అని మనసులో అనుకున్నాడు.
భోజనం అయ్యాక, సురేష్ ... షాపు యజమానికి ధన్యవాదాలు చెప్పి, ఇక వెళతాను సార్ ...'' అన్నాడు. ''నేను వచ్చే దాకా ఇక్కడే ఉండు.'' అని షాపు యజమాని బయటకు వెళ్లాడు. చాలాసేపటి తరువాత వచ్చాడు. ఈలోగా గుమాస్తా చిన్న చిన్న పనులు చెప్పాడు. సురేష్ అవన్నీ చాలా శ్రద్ధగా, ఓపికగా చేశాడు.
షాపు యజమాని వచ్చాక, ''నేను వెళతానండీ..'' అని సురేష్ చెప్పాడు. అప్పుడు అతడు రూ.300 లు చేతిలో పెట్టి, ఇది ఈరోజు కూలి. రేపటి నుంచి వచ్చి ఇక్కడే పనిచేయి.'' అన్నాడు.సురేష్ చాలా సంతోషించాడు. ఈరోజు నేను ఏ పనీ చేయలేదు కదా? ఈ డబ్బు ఎందుకిచ్చారు? పైగా మీ దగ్గర ఎలాంటి పనీ లేదని చెప్పారు కదా?'' అని అన్నాడు.
''నీ మాటల్లో నిజాయితీ ఉంది. నీ ప్రవర్తనలో ఓపిక ఉంది. మా షాపులో పనిచేయాలి అంటే ఈ రెండూ ముఖ్యం. నీకు తెలియకుండానే పరీక్ష పెట్టాను. నువ్వు నెగ్గావు. అందుకే నీకు పని ఇస్తున్నాను.'' అన్నాడు షాపు యజమాని. ఆ మాటలకు సురేష్ చాలా సంతోషపడ్డాడు. ప్రతిరోజూ షాపునకు వచ్చి పనిచేస్తూ, మంచి సహాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు.
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
94415 61655










