చండీగఢ్ : భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ పాకిస్తాన్‌లో ముష్కరుల చేతిలో హతమయ్యాడు. 2016 పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి అయిన జైషే మహ్మద్ ఉగ్రవాది షాహీద్ లతీఫ్‌ని పాకిస్తాన్‌లో సియాల్‌కోట్‌లోని మసీదులో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు నివేదికలు తెలిపాయి. ఈ ఘటనలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఉగ్రవాది లతీఫ్ అలియాస్ బిలాల్, అతని ఇద్దరు సహచరులు కూడా తుపాకీ కాల్పుల్లో మృతి చెందారు. లతీఫ్ 1993లో కాశ్మీర్‌లోకి లోయలోకి చొరబడ్డాడు. ఒక సంవత్సరం తర్వాత అరెస్టయ్యాడు. జైష్ ఇ మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌తో కలిసి 2010 వరకు జమ్మూ జైలులో ఉన్నాడని అధికారులు తెలిపారు. 2010లో యుపిఎ ప్రభుత్వం సత్ప్రవర్తన కారణంగా విడుదల చేసిన 25 మంది ఉగ్రవాదుల్లో లతీఫ్ కూడా ఉన్నారు.
కాగా, 2016 జనవరి 2 పఠాన్‌కోట్ వైమానికస్థావరంపై దాడికి లతీఫ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. జైష్ ఇ మహ్మద్ గ్రూపుకు చెందిన నలుగురు ఉగ్రవాదులు పఠాన్‌కోట్ వైమానక స్థావరంలోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. అప్పుడు జరిగిన ఈ దాడిలో ఏడుగురు ఐఎఎఫ్ సిబ్బంది మృతి చెందారు.










