వాట్సాప్ గ్రూప్ తన వినియోగదారులు అంగీకరించాల్సిన కొత్త గోప్యతా విధానాన్ని తాత్కాలికంగా అటకెక్కించడంతో వివాదం సద్దుమణిగింది. ఆ విధానం ప్రకారం వినియోగదారుడు నెరపే వ్యాపార సంబంధిత సందేశాలు, సమాచారాలు వాట్సాప్ ఇతర సంస్థలతో పంచుకొనే వీలు కలుగుతుంది. అందుకు ఒప్పుకోని వారు తమ సేవల నుండి వైదొలగవచ్చని వాట్సాప్ తొలుత ప్రకటించినా, తరువాత వెనక్కి తగ్గి ఆ విధానాన్ని వాయిదా వేసింది. కొత్త విధానం ద్వారా వ్యక్తిగత గోప్యతకు నష్టం కనబడకపోయినా, ఆ సంస్థ ఉద్దేశ్యాలపై అనుమానాలు రేకెత్తి వేల సంఖ్యలో వినియోగదారులు వైదొలిగారు. ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని పూర్తిగా వదులుకొమ్మని భారత్ ఆ సంస్థని కోరింది. ఒక్కో దేశానికి ఒక్కో విధానం సరికాదంది. ఎందుకంటే ఈ రకమైన విధానాల్ని యూరప్ చట్టాలు ఒప్పుకోవు కనుక అక్కడీ ప్రయత్నాల్ని ఆ సంస్థ చెయ్యలేదు. అయితే ఇలా ఒక్కో సంస్థనీ ఇలా చేయొద్దని అభ్యర్ధించడం కన్నా పౌరుల వ్యక్తిగత సమాచార రక్షణకై పటిష్టమైన చట్టం తీసుకువస్తే మేలు. ఆ విషయంలో యూరప్ ని అనుకరించడం మంచిది. అదే తరహా చట్టం ఇక్కడా వుంటే బహుళ సంస్థల దొడ్డిదారి ప్రయత్నాలకు అడ్డుకట్ట పడి, వినియోగదారుడికి బలం చేకూరుతుంది. సుప్రీం కోర్టు గోప్యతను ప్రాథమిక హక్కుగా, జీవించే హక్కులో భాగంగా ఇదివరకే గుర్తించింది. ప్రస్తుతం పార్లమెంటు పరిశీలనలో ఉన్న సమాచార రక్షణ చట్టం పకడ్బందీ చట్టంగా రూపుదిద్దుకొనేలా ప్రయత్నం జరగాలి. డిజిటల్ యుగంలో సామాన్యుడి వ్యక్తిగత గోప్యతా హక్కుని కాపాడడం ఎంతో అవసరం.
* డా||డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం.










